సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక, కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సులో నుంచి వెలికితీశాయి. ఈ ఘటన నుంచి 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరితో తెలంగాణకు సంబంధించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. సూరారంలో ఇద్దరు, జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ సిచ్చాఫ్ వస్తోంది. జేఎన్‌టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. అంతేకాకుండా.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి బయలుదేరిన వారు ఇద్దరు ఉన్నారు. బెంగళూరుకు చెందిన తల్లీ కుమారులు పిలోమి నాన్ బేబీ(64), కిషోర్ కుమార్(41) ఇటీవల దీపావళి పండగకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలోని బంధువు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాము ఇంటికి వచ్చారు.
గురువారం సాయంత్రం పటాన్‌చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరు బయలుదేరారు. అయితే ఈ లోపే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదానికి గురవడంతో వీరు క్షేమంగా ఉన్నారా లేదా? అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ కనుక్కునేందుకు రాము దంపతులు కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.



