ఫ్యూచర్ సిటీ స్టాల్‌ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో భట్టి , పొంగులేటి, కోమటిరెడ్డి, సీఎస్, హీరో నాగార్జున తదితరులు
15 నిమిషాల వ్యవధిలో ఇంటి నుంచి పని ప్రదేశానికి చేరుకునే వీలు
ఇళ్లు, ఆఫీసులు, విద్య, వైద్యం, వినోద కేంద్రాలన్నీ ఒకేచోట
గ్లోబల్ సమ్మిట్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ లక్ష్యాన్ని వివరిస్తూ ప్రత్యేక స్టాల్
సాక్షి, హైదరాబాద్: నడుచుకుంటూనే ఆఫీసుకు వెళ్లొచ్చు.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఇంటికి దగ్గర్లోనే సినిమాకో, షికారుకో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. వైద్య సేవలూ ఇంటికి చేరువలోనే..! భారత్ ఫ్యూచర్ సిటీ లక్ష్యమిదీ. 15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లో ఈ ఫోర్త్ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరానికి దక్షిణాన శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల మధ్యలో మీర్‌ఖాన్‌పేట ప్రాంతంలో ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుండటం తెలిసిందే.
సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్.. ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్–2025లో ఏర్పాటు చేసిన భారత్ ఫ్యూచర్ సిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫిబ్రవరిలో ఎఫ్‌సీడీఏ ఆఫీసు ప్రారంభం..
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌సీడీఏ అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు.
అన్ని రకాల గృహ సముదాయాలు..
ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలకు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఫ్యూచర్ సిటీలో లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది.
ఫ్యూచర్ సిటీలో ఏ జోన్‌కు ఎంత భూమి అంటే..
నివాస విభాగం: 1,300 ఎకరాలు
డేటా సెంటర్లు: 500 ఎకరాలు
ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్: 2,000 ఎకరాలు
ఎడ్యుకేషన్: 500 ఎకరాలు
హెల్త్ సిటీ: 150 ఎకరాలు
కృత్రిమ మేధ: 300 ఎకరాలు
ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్: 900 ఎకరాలు
ఈవీ అండ్ బీఈఎస్‌ఎస్: 200 ఎకరాలు
లైఫ్ సైన్సెస్: 3,000 ఎకరాలు


