2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం వాటాయే లక్ష్యం
సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా క్యూర్, ప్యూర్, రేర్.. ‘తెలంగాణ రైజింగ్’ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలన్న సీఎం
సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
వికసిత్ భారత్ తరహాలోనే విజన్ 2047 లక్ష్యాలు: గవర్నర్
భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్న జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగంతో నాటి నాయకత్వం భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేసిన తరహాలోనే తెలంగాణ భవిష్యత్తు కోసం తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే పదేళ్లలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 2047లో వందేళ్లు పూర్తయ్యే నాటికి సాధించాల్సిన అంశాలపై చర్చించే క్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌కు బీజం పడిందన్నారు.
విజన్ లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా అనిపించినా సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. కష్టమైన ప్రణాళికలను వెంటనే చేపట్టి, అసాధ్యమైన వాటికి కొంత గడువు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో, ‘తెలంగాణ రైజింగ్’ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో సీఎం కీలకోపన్యాసం చేశారు.
రాష్ట్రం కలలు నెరవేర్చేందుకే..
‘దశాబ్దాల పాటు సాగిన ప్రత్యేక రాష్ట్ర పోరాట ఫలితంగా దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర భవిష్యత్తు కలలు నెరవేర్చేందుకు నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో చర్చించి విజన్ డాక్యుమెంటు తయారు చేశాం. రెండు రోజుల సదస్సులో వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్య వేత్తలు, ప్రభుత్వాధికారులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
గ్వాంగ్‌డాంగ్ నమూనా స్ఫూర్తి దేశంలో 2.9 శాతం జనాభా కలిగిన తెలంగాణ.. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉంది. 2047 నాటికి 10 శాతం వాటాను రాష్ట్రం కలిగి ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలుగా విభజించాం. ఈ మూడు ప్రాంతాలను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా మారుస్తాం. చైనాలోని అతిపెద్ద ప్రావిన్స్ ‘గ్వాంగ్ డాండ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే ప్రపంచంలో అత్యధిక పెట్టుబడులు, వృద్ధిరేటును సాధించింది. గ్వాంగ్‌డాంగ్ నమూనాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందిన తెలంగాణ.. ప్రస్తుతం ఆ దేశాలతో పోటీ పడాలని అనుకుంటోంది..’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.
సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
‘ప్రదానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలు ఉన్నాయి. వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్‌లో సమగ్రాభివృద్ధి, స్థిరమైన విధానాలు, ఆవిష్కరణలు మూల స్తంభాలుగా ఉన్నాయి. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సంకల్పంతో ముందుకు సాగుతున్న రీతిలోనే తెలంగాణ కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు, రైతులు, యువత, పిల్లలను కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. మహిళల స్వశక్తీకరణలో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, రిటైల్ ఎంటర్‌ప్రైజ్‌లు, సౌర శక్తి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలను ఆర్థిక వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మార్చడంతో పాటు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల పునరుద్ధరణ వంటి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాం«దీజీ స్ఫూర్తితో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్, నైపుణ్య శిక్షణ, క్రీడా యూనివర్సిటీలు యువతను భవిష్యత్తు వైపు మళ్లిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్తగా మార్చేందుకు రాష్ట్రంలో విమానాశ్రయాలు, పునరుత్పాదక శక్తి, రవాణా వ్యవస్థలు, స్మార్ట్ జోనింగ్ వంటి ఆధునిక మౌలిక వసతులను ప్రభుత్వం చేపడుతోంది.
పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న విధానాలు
ప్రభుత్వ స్థిరమైన, స్పష్టమైన విధానాలు పెట్టుబడులను, ఆవిష్కరణలను ఆకర్షిస్తున్నాయి. మహిళా కారి్మకుల కోసం ‘గిగ్ వర్కర్ల పాలసీ’, రెస్ట్ సెంటర్లు వంటి వినూత్న ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. సాంకేతికత, వృత్తి ఆధారిత నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేస్తోంది. ప్రజల సేవకులుగా పనిచేసే ప్రభుత్వాలు బాధ్యతాయుత పాలనతో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొదిస్తాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది.’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
రాష్ట్రాల సహకారంతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
‘సాంకేతికతతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసిన హైదరాబాద్ కేవలం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిది. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాస్యూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముంది. 2047 నాటికి వికసిత భారత్‌గా వెలుగొందాలనే ప్రధాని మోదీ కల రాష్ట్రాల కీలక సహకారంతోనే సాకారమవుతుంది. పరిశ్రమలను, స్టార్టప్‌లను, టాలెంట్‌ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలి. రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీతో ప్రమాణాలు పెరగడంతో పాటు సంస్కరణలు జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా అవతరించింది.
అభివృద్ధిలో రాష్ట్రంతో కలిసి పనిచేస్తాం
2014 నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు, రైల్వే రంగానికి రూ.32 వేల కోట్లు కేటాయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రూ.521 కోట్లతో కాజీపేలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రామగుండంలో రూ.11 వేల కోట్లతో ఎనీ్టపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించాం. మరో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉంది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.2,300 కోట్లతో జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
బెంగళూరు హైదరాబాద్ నడుమ దృఢ బంధం: డీకే శివకుమార్
‘కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నా మిత్రుడు రేవంత్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చా. అభివృద్ధి పథంలో సాగుతున్న బెంగళూరు, హైదరాబాద్ నడుమ దృఢ బంధం ఏర్పడాల్సిన అవసరముంది. రెండేళ్లలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గణనీయమైన పురోగతితో అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ సదస్సు తీరును చూస్తే బెంగళూరుతో కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయంగా పోటీ పడుతున్నట్టుంది. విజన్ డాక్యుమెంట్ 2047 వచ్చే తరం ఆకాంక్షలకు అద్దం పడుతుంది. దేశ ఆర్థిక పురోగతిలో దక్షిణాది రాష్ట్రాలు మరింత ఐక్యంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్‌ను విస్మరించలేని పరిస్థితి ఉంది. రెండు నగరాలు పరస్పరం పోటీ పడకుండా సహకారంతో ముందుకు సాగడం ద్వారా భారత సాంకేతిక, ఆర్థిక రంగాలకు మూల స్తంభాలుగా నిలుస్తాయి..’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.


