హాయ్ చెప్పిన రోబోతో సీఎం కరచాలనం
అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ షురూ..
గుస్సాడి, కొమ్ముకోయ, డోలు వాయిద్యాలతో ప్రతినిధులకు ఆహ్వానం
ఎన్నో ప్రత్యేకతలు.. ఇన్నోవేషన్ ప్రదర్శనలు
హాజరైన పలువురు ప్రముఖులు
అతిథులకు ప్రత్యేక విందు.. కీరవాణి కచేరీ, అలేఖ్య పుంజల నృత్య ప్రదర్శన
రంగారెడ్డి జిల్లా/ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘గ్లోబల్ సమ్మిట్– 2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సుకు వచ్చిన అతిథులకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడి, భద్రాచలం జిల్లాకు చెందిన కొమ్ముకోయ కళాకారులు తమ నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు.
పలువురు మంత్రులు, వీఐపీలతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగ్జి బిషన్ హాల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి..అక్కడ మానవ రూపంలో ఉన్న రోబో హాయ్ చెప్పి లోనికి ఆహ్వానించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా రోబోతో ముఖ్యమంత్రి కరచాలనం చేశారు. ఆ తర్వాత ఎంఆర్‌డీసీఎల్, భారత్ ఫ్యూచర్ సిటీ స్టాళ్లను, విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్‌జీరో సిటీ, పోలీసు విభాగం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఏరోస్పేస్, ఏవియేషన్ ప్రదర్శనలను వీక్షించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ స్టాల్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు.
మూసీ సుందరీకరణ ఇలా..
మూసీకి జీవం పోస్తూ రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదికి రెండు వైపులా భవిష్యత్తులో చేపట్ట నున్న అభివృద్ధి పనులు, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, పార్కులు, అందమైన భవనా లను ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా చూపించారు. ఏ ప్రదేశంలో ఏ ప్రాజెక్టు రాబోతుంది? వంటి అంశాలను డిజిటల్ తెరలపై ప్రదర్శించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ప్రవేశ ద్వారం మొదలుకుని సమావేశ మందిరాలకు వెళ్లే మార్గాల్లో డిజిటల్ తెరలపై వివిధ దేశాల జాతీయ పతాకాలు, డిజిటల్ టన్నెల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ హాల్ మధ్యలో గ్లోబ్‌ను ఏర్పాటు చేశారు. అంతరిక్ష ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి నిర్మించబోతున్న భవిష్యత్ నగరాన్ని కళ్లముందు ఆవిష్కరించారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రదర్శించిన ‘ఫ్లైట్ సిమ్యూలేటర్’ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ధృవ స్పేస్ సెంటర్ నిర్వాహకులు శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ సహా రాడార్లను ప్రదర్శించారు. పి–30 శాటిలైట్ సహా ఆస్ట్రా వ్యూ.. ఇస్రో ప్యానల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో సిటీ స్టాల్ ఆధ్యంతం ఆకట్టుకుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సహా కాలుష్య రహితంగా ఈ ప్రాంతం ఏ విధంగా ఆవిçష్కరించబోతుందో ఇక్కడ వివరించారు.
సంక్షేమ విద్యార్థుల ప్రతిభ..
ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ఆదిలాబాద్ జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కాలేజీ విద్యార్థినులు సీహెచ్ రనూష, జె.వైష్ణవిలు రూ.10 వేల ఖర్చుతో రూపొందించిన ‘మల్టీ పర్పస్ అగ్రికల్చర్ మిషన్’ పారిశ్రామిక వేత్తలను ఆలోచింపజేసింది. ఇది ఇంధనం అవసరం లేకుండా ఒకే సమయంలో దుక్కి దున్నడం, విత్తనాలు వెదజల్లడం, నీటిని చల్లడం వంటి పనులు చేస్తుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహానికి చెందిన పదో తరగతి విద్యార్థి జి.గగన్‌చంద్ర రూ.25 వేల ఖర్చుతో తయారు చేసిన త్రి ఇన్ ఒన్ హైబ్రిడ్ సైకిల్ సైతం సందర్శకులను ఆకర్షించింది.
12 అంశాలపై చర్చా గోష్టులు
సదస్సు ప్రారంభోత్సవం తర్వాత అనుబంధ హాళ్లలో రెండు సెషన్లలో 12 అంశాలపై చర్చా గోష్టులు జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
స్కిల్స్ వర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి నమూనాలు
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నమూనా’ సహా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్తగా నిర్మించ తలపెట్టిన ఉస్మా నియా ఆస్పత్రి భవనం నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హెచ్ ఎండీఏ, హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో రీజినల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్ మ్యాప్‌లను ప్రదర్శించారు. ఇందిరా మహిళా శక్తి స్టాల్లో ఫ్యూయల్ స్టేషన్ నమూనాను ప్రదర్శించారు. నెట్ జీరో సిటీలో ప్రభుత్వం పూర్తి ప్లాస్టిక్ రహితంగా ఏర్పాట్లు చేసింది.
ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియో
సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నాగార్జున చెప్పారు.


