తీవ్రవాదం, విభజన, విద్వేష రాజకీయాలు పేట్రేగిపోతున్నాయి
ఆర్థిక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనే సమస్యలకు పరిష్కారం
నోబెల్ గ్రహీత కైలాశ్‌సత్యార్థి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం గతంలో ఎన్నడూ ఇంతగా టెక్నాలజీ, ఐటీ, వనరుల సంపద కలిగి లేదని..అయినా ఏనాడూ పలు కీలకాంశాల్లో ఇంత దారిద్య్రాన్ని ఎదుర్కో లేదని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత కుమ్ములాటలు, తీవ్రవాదం, విభజన, విద్వేష రాజకీయాలు పెట్రేగిపోతున్నా యని.. మానవత్వం కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతితో పాటు ప్రజలూ ప్రమాదంలో పడ్డారన్నారు. ఈ పరిస్థితుల్లో వినూత్న పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనే ఈ సమస్యలకు పరిష్కారమని, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం గొప్ప ముందడుగు వేసిందని ప్రశంసించారు. ఫ్యూచర్ సిటీలో సోమ వారం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఈ లక్ష్యం అసాధ్యమేమీ కాదు..
ప్రపంచం నైతిక స్థైర్యం, జవాబుదారీతనం, బాధ్యత విష యంలో తీవ్ర కొరత ఎదుర్కొంటోందని సత్యార్థి చెప్పారు. నిస్వార్థంతో మేధస్సును రంగరించి ప్రపంచంలో ఒకరి సమస్యలను మరొకరు పరిష్కరించుకుంటే, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అభివృద్ధి చెందడం అసాధ్యమేమీ కాదన్నారు. రెండేళ్లలో 20 మంది లక్షల రైతుల రుణాల మాఫీ, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, విద్యా, వైద్య రంగాల ప్రక్షాళన ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌ను ప్రశంసించారు. దేశంలో 100 కోట్ల సమస్యలుంటే, వాటికి 130 కోట్ల మంది ప్రజలే పరిష్కారమని చెప్పారు.
రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం: టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ దినేశ్
సీఐఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 5 వేల నుంచి 10వేల మంది రైతులను పారి శ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఐఐ మాజీ చైర్మన్, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.దినేష్ తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధికి టీవీఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో సహకరిస్తామన్నారు.
మూడేళ్లలో రూ.1,700 కోట్ల పెట్టుబడులు: శోభన కామినేని
అపోలో హాస్పిటల్స్ విస్తరణలో భాగంగా ప్రోటాన్ ఆధారిత ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటుకు వచ్చే మూడేళ్లలో రూ.1,700 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నామని అపోలో హాస్పిటల్స్ ఎగ్జి క్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని వెల్లడించారు. ‘జెమినాయ్’ పేరుతో ఏఐ ఆధారిత వైద్య సేవలను తయారు చేశామని, డీప్‌సీక్ కంటే చౌకగా ఇది
అందుబాటులోకి వచ్చిందన్నారు.
రూ.2,500 కోట్లతో గ్రీన్‌డేటా సెంటర్: కరణ్ అదానీ
రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో 48 మెగావాట్ గ్రీన్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదాని ప్రకటించారు. కట్టింగ్ ఎడ్జ్ ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుందన్నారు.
తెలంగాణతో కొనసాగుతాం: జెరెమీ జుర్జెన్స్
భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణతో గత కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని, ఈ భాగస్వామ్యాన్ని ఇకపైనా కొనసాగిస్తామని.. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అండ్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విభాగం అధిపతి ఎండీ జెరెమీ జుర్జెన్స్ తెలిపారు. జనవరిలో దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సు, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగే బయో ఏసియా సదస్సులో సీఎం రేవంత్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
చిన్న అడుగులే పెద్ద లక్ష్యాల సాధనకు సోపానం: అభిజీత్ బెనర్జీ
ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే అత్యంత ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభి జీత్ బెనర్జీ స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో వేసే సరైన చిన్న చిన్న అడుగులే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందిస్తాయ న్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనకు ఏం చేయాలి? అనే ఆలోచన చేయడంతోనే మార్గం ఏర్పడుతుందన్నారు.


