రేవంత్ సర్కార్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే...నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం
ముఖ్యమంత్రి, మంత్రులు బరితెగించి కుంభకోణాలకు పాల్పడుతున్నారు
ఆరు గ్యారంటీలు అటకెక్కాయి.. ఆత్మహత్యలు పెరిగాయి
కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
రెండేళ్ల కాంగ్రెస్ పాలన.. వైఫల్యాలపై బీఆర్‌ఎస్ చార్జిషీట్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెండేళ్లు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రెండేళ్లు. రెండేళ్ల మొండిచేయి ఇది. ఒక ప్రభుత్వానికి మొదటి రెండేళ్ల సమయం అనేది అత్యంత కీలకం. ప్రభుత్వ విజన్ ఏమిటో..విధానం ఏమిటో.. అభివృద్ధి, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో తేటతెల్లం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన సమయంలో దాదాపు సగం పూర్తయ్యింది. ఇక మిగిలింది రెండేళ్ల కాలమే. చివరి ఏడాదైతే ఎన్నికల హడావుడి, కోడ్‌తోనే సరిపోతుంది. రేవంత్ రెండేళ్ల పాలనను నిర్వచించాలంటే.. మూడేమూడు మాటలు నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం’అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలన– వైఫల్యాలపై బీఆర్‌ఎస్ చార్జిషీట్’ను హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు గుప్పించారు.
ఒక్కరోజు బాగోతంగా ప్రజా దర్బార్
‘సీఎం కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తామన్న ప్రజాదర్బార్ ఒక్కరోజు బాగోతమైంది. సీఎంతోపాటు మంత్రులు కూడా రావడం లేదు. ప్రగతిభవన్ ముందున్న ఇనుప గ్రిల్స్ తీసేసి షో చేసిన బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి. ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్‌గా మారింది. డిప్యూటీ సీఎం ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌లు, సాయంత్రంగానా భజానాలు, సంగీత్‌లు, పెళ్లిళ్లు, రిసెప్షన్లతోని ప్రజాభవన్ ప్రీమియం భవన్‌గా, ఢిల్లీ బాసులకు గెస్ట్ హౌస్‌గా మారింది’అని హరీశ్‌రావు అన్నారు.
రెండేళ్ల పాలనలో విధ్వంసం
‘రెండేళ్ల పాలనలో ప్రజాధనం కొల్లగొట్టి తమ సొంత సంపాదనపై సీఎం, మంత్రులు దృష్టి పెట్టారు. బరి తెగించి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇంత ప్లాన్డ్‌గా, ఇంత ఆర్గనైజ్డ్‌గా కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు దేశంలో ఎక్కడ ఉండరు. కరప్షన్ కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలనే సిలబస్. ఆరు గ్యారంటీలు అటకెక్కించిండు. అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. హైడ్రా పేరిట కూల్చివేతల అరాచకంతో సృష్టించాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ఆగమైపోయింది’అని అన్నారు.
కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్
‘కాంగ్రెస్ పార్టీ స్కాంల వారసత్వాన్ని రేవంత్ కూడా కొనసాగిస్తున్నాడు. ఆర్‌ఆర్ ట్యాక్స్, భట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఎనుముల బ్రదర్స్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారు. హైడ్రా పేరిట విలువైన భూములు కొల్లగొట్టే స్కాం.. మూసీ సుందరీకరణ పేరిట పరీవాహక భూములు బుక్కే స్కాం, 450 ఎకరాల హెచ్‌సీయూ భూములను చెరబట్టే బడా స్కాం. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే స్కాం. హిల్ట్‌పి పేరిట రూ.5 లక్షల కోట్ల స్కాం. రూ. 50 వేల కోట్ల పవర్ స్కాం. ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను పాస్ చేసి మెడికల్ స్కాం’’అని హరీశ్‌రావు విమర్శించారు.
కేసీఆర్ పథకాలు రద్దు
‘గత ప్రభుత్వాలవైనా ప్రజలకు మేలు చేసే పథకాలను కేసీఆర్ అమలు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను యథాతథంగా అమలు చేశారు. రేవంత్ మాత్రం వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ తెచి్చన పథకాలను ఆపి పేద ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కేసీఆర్ పేరు’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆత్మహత్యలు పెరిగాయి
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రెండేళ్లలో 822 మంది రైతులు, 48 మంది నేతన్నలు, 116 మంది గురుకుల విద్యార్థులు, 179 మంది ఆటో డ్రైవర్లు, 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఐదుగురు బిల్డర్లు, ఒక బీసీ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులివ్వలేదు కానీ...బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.9000 కోట్లు విడుదల చేసిండు. కమీషన్లు దండుకునేందుకు రేవంత్ స్పెషల్ స్కీం తెచ్చాడు. యంగ్ ఇండియా స్కూళ్ల స్కాం త్వరలో బయటపెడుతాం.’అని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రజల సొమ్మునువాడి సొంత ఇమేజ్ పెంచుకునేందుకు మెస్సీతో మ్యాచ్ అంటూ పీఆర్ స్టంట్‌లు వేస్తున్నావ్. హోం శాఖ నీ దగ్గరే ఉంది..పెరుగుతున్న క్రైమ్ రేట్‌కు సమాధానం చెప్పాలి. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు నీకు దగ్గర్లోనే ఉన్నాయి’అని హెచ్చరించారు.
అందరికీ...
‘ఆరు గ్యారంటీల పేరుతో ఆడబిడ్డలను రేవంత్ సర్కార్ నిలువునా మోసం చేసింది. 17శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల నోట్లో మట్టి కొట్టారు. మైనారిటీలకు ద్రోహం చేశారు. ఆటో సోదరుల కష్టాల పాలయ్యారు. రెండేళ్లలో జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేదు. సాగునీటి రంగంలో చేసింది సున్నా. రెండేళ్లలో నువ్వు ఎన్ని ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్‌రెడ్డి’అని హరీశ్‌రావు అన్నారు.


