చంద్రబాబు సర్కారులో ఏకంగా 19 అక్రమ కేసులు నమోదు
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి తాజాగా విచారణ నోటీసులు
హైదరాబాద్‌లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు
అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు ‘సాక్షి’పై ప్రభుత్వ కక్షసాధింపు
ప్రజా సమస్యలపై గళమెత్తుతుండడంతో అణచివేసేందుకు కుయుక్తులు
సాక్షి, అమరావతి: పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై కక్షసాధింపును మరింత విస్తృతం చేస్తోంది. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. కర్నూలులో రూ.4 వేల కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు అధికార టీడీపీ నేతలు పన్నిన కుట్రలను బట్టబయలు చేయడం, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నవారి ఆందోళనకు మద్దతుగా నిలిచినందుకు ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులు నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు విచారణ పేరుతో సోమవారం కర్నూలు పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో హల్‌చల్ చేశారు. పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డికి 35 బీఎన్‌ఎస్‌ఎస్ కింద నోటీసులిచ్చారు.
ఆధారాలతో కథనాలు..
వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం బాబు సర్కారులో... సాక్షి ప్రధాన కార్యాలయం, ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల నమోదు, నోటీసులు, విచారణ పేరుతో వేధించడాన్ని పోలీసులు వారి విధానంగా మలుచుకున్నట్లు స్పష్టమవు తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్‌పై 19 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనం. అక్రమ కేసులకు కారణమైన కథనాల్లో ఒక్కదాంట్లోనూ ‘సాక్షి’ అవాస్తవాలను ప్రచురించలేదు. పూర్తి ఆధారాలతో ఇస్తూ బాధితులు చెప్పిందే పేర్కొన్నది తప్ప సొంత భాష్యం ఇవ్వలేదు. వాస్తవాలను వక్రీకరించలేదు. అయినా, బాబు ప్రభుత్వ డైరెక్షన్‌లో పోలీసులు అక్రమ కేసులకు తెగబడుతున్నారు. పోలీసు ఉన్నతాధికా రులు అత్యుత్సాహంతో కొన్ని నమోదు చేయిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఆదేశించి మరీ మరికొన్ని నమోదు చేయిస్తున్నారు.
బాధితుల పక్షాన నిలిచినందుకే...
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలుగె త్తడం, బాధితుల ఆవేదనను వెలుగులోకి తేవడమే ‘సాక్షి’ చేసిన నేరం అన్నట్లు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల కుట్రపై కర్నూలు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారు. 19 అక్రమ కేసుల్లో 5 ఈ జిల్లాలోనే నమోదవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవల నమోదు చేసిన కేసు మరీ విడ్డూరంగా ఉంది. కర్నూలులోని ఏ, బీ, సీ క్యాంప్ క్వార్టర్లను ఖాళీ చేయించాలని మంత్రి భరత్ ఆదేశించారు.
ఆ భూముల్లో స్టేడియం నిర్మిస్తామని ఓసారి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మరోసారి చెప్పారు. వీటిలో ఏ నిర్మాణానికీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినాసరే, అక్కడివారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు మంత్రి భరత్ సంసిద్ధులయ్యారు. కర్రపట్టుకుని మరీ ఖాళీ చేయిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. దాంతో దశాబ్దాలుగా ఉంటున్న కుటుంబాలు తీవ్ర నిరసన తెలిపాయి. ‘సాక్షి’ దీన్ని ప్రచురించింది. ఆగ్రహించిన మంత్రి భరత్... సాక్షిపై అక్రమ కేసు నమోదు చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసులు జీహుజూర్ అన్నారు. అంతేకాదు సోమవారం ఏకంగా సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఎడిటర్‌కు నోటీసులిచ్చారు.
➜భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులే ఎత్తుకెళ్లారు. దీన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు. రాయలసీమలో భారీ దందాకు పాల్పడుతున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారి బాగోతాన్ని బయటపెట్టినందుకు మరో అక్రమ కేసు పెట్టారు. ఇక టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి భరత్ అనుచరులు వాట్సాప్ మెసేజులతో బెదిరించారు. ఈ విషయాన్ని ప్రచురించినందుకు సాక్షిపై అక్రమ కేసు నమోదు చేశారు.
➜పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రైవేట్ పీఏ సతీశ్... ఒంటరి ఉద్యోగిని ఆర్థికంగా, లైంగికంగా వేధించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై సాలూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.
➜పోలీసు శాఖలో అర్హులైన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల్లో అన్యాయం జరగడాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులే అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం.
➜ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురైందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో విమర్శించారు. సంబంధిత ఫొటోలను ప్రదర్శించారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.
➜రాష్ట్రంలో టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బట్టబయలవడంతో ప్రభుత్వం కంగారుపడింది. నకలీ మద్యం బాగోతాన్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి గొంతు నొక్కేందుకు అక్రమ కేసులకు తెగించింది. కల్తీ మద్యం తాగి ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి ప్రచురించగా బాబు సర్కారు తట్టుకోలేపోయింది. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాక దానిని వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కక్షసాధింపునకు దిగారు.
ప్రభుత్వం ఆదేశాలతో ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టారు. అర్థరాత్రి వేళ హైదరాబాద్, విజయవాడ సాక్షి కార్యాలయాలు, సాక్షి పాత్రికేయుల నివాసాలకు వెళ్లి నోటీసుల పేరుతో వేధించారు. ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డికి వాట్సాప్‌లో ముందుగా నోటీసులు పంపారు. వాట్సాప్‌లో నోటీసులు షేరింగ్ వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా దాన్ని ఉల్లంఘించారు. అనంతరం విచారణ పేరుతో పేరుతో ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డికి ఏకంగా 85 ప్రశ్నలతో బుక్‌లెట్ ఇచ్చారు. పత్రికలు, మీడియా ఎలా విధులు నిర్వర్తిస్తాయనే కనీస అవగాహన లేకుండా ఈ ప్రశ్నావళి ఉంది. న్యూస్ సోర్స్, బాధితుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే విస్పష్టంగా ప్రకటించింది. కానీ, సాక్షి వద్ద ఆవేదన వెళ్లగక్కిన బాధితుల వివరాలు చెప్పాలని, న్యూస్ సోర్స్ వెల్లడించాలని ఏపీ పోలీసులు ప్రశ్నించడం విస్మయపరిచింది.


