నోటీసులు కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటుడు యశ్‌కు ఆదాయ పన్ను శాఖ(ఐటీ) నోటీసుల కేసులో ఉపశమనం లభించింది. కేజీఎఫ్ సినిమాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో 2021లో ఐటీ అధికారులు యశ్ ఇళ్లు, హోంబాళె నిర్మాణ సంస్థ ఆఫీసులు, యజమానుల ఇళ్లలో దాడులు చేసింది. సేకరించిన సమాచారం ఆధారంగా 2013 నుంచి 2019 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి వివరాలను సమర్పించాలని అప్పట్లో ఐటీ అధికారులు యశ్‌కు నోటిసులిచ్చారు.
వీటిని సవాల్ చేస్తూ యశ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణలో యశ్ విచారణ పరిధిలోని వ్యక్తి కాదని, నోటీసులు ఇవ్వడం తప్పని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఆర్.కృష్ణ కుమార్ నోటీసులను రద్దు చేస్తూ అదేశాలిచ్చారు. కాగా, యశ్ నటించిన కొత్త సినిమా ట్యాక్సిక్ విడుదలకు సిద్ధమైంది. కేజీఎఫ్–2 తరవాత వస్తున్న యశ్ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


