సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో సాక్షి విజయనగరం ఆఫీసుకు వచ్చిన పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. అయితే, టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు.
సాక్షి కథనంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి, పీఏ సతీష్‌కు గౌరవ భంగం కలిగింది అని మక్కువ మండలం టీడీపీ అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాల నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు సాక్షికి నోటీసులు ఇచ్చారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. దీంతో విషయం జనాల్లోకి పోవడంతో ఆమెను గప్‌చుప్‌గా వదిలేశారు.
ఈ క్రమంలో బాధితురాలి గురించి కథనాలు ఇచ్చిన సాక్షికి నోటీసులు జారీ చేసింది. బీఎన్‌ఎస్ 94 ప్రకారం.. ప్రసారం చేసిన కథనాలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. అలాగే.. సతీష్ అకృత్యాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ చాటింగ్(ఇందులో మంత్రి కుమారుడి చాటింగ్ కూడా) ఉన్న ఫోన్‌ను ఇప్పటికే ఆమె పోలీసులకు అప్పగించారు. పోలీసులు అవేవీ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆమె వెనక ఎవరైనా ఉన్నారా? అని ఆరాలు తీస్తున్నారు. తద్వారా విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసేలా కనిపిస్తోంది.


