తిరుపతి, సాక్షి : శ్రీకాళహస్తి మండలం వేలంపాడు గ్రామంలో ఇటీవల ఘోరం జరిగింది. ఓ టైల్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కీలక ప్రకటన చేసింది.
ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ అంటున్నారు. ‘‘ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదు. పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగింది. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదు’’ అని ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన.
వేలంపాడు సోమేనీ ఫ్యాక్టరీలో నైట్రోజన్ గ్యాస్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల్ని చీరాలకు చెందిన పోతురాజు, ఒడిశాకు చెందిన పాండే గా గుర్తించారు. అయితే.. ఘటన తర్వాత బాధిత కుటుంబాలను, వైద్య సిబ్బందిని, మీడియాను లోపలకు అనుమతించకపోవడంతో యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


