సాక్షి, మన్యం: స్వయానా ముఖ్యమంత్రే మందలించినా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీరు మారడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ తన వ్యక్తిగత సహాయకుడు(మాజీ) సతీష్‌నే ఇంకా వెనకేసుకొస్తున్నట్లు కనిపిస్తున్నారు. కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఇటు పోలీసులు చర్యలకు దిగడం లేదు. దీనికి తోడు బాధితురాలికి అండగా నిలుస్తున్న సాక్షికి బెదిరింపులు తప్పడం లేదు.
మంత్రి సంధ్యారాణి పీఏ వేధింపుల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. అతణ్ని దూరం పెట్టాలని, ఈ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని చంద్రబాబు ఆమెకు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం సతీష్‌ను రక్షించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. ఈ క్రమంలో పోలీస్ విచారణను మంత్రి సంధ్యా రాణి పిన్ టు పిన్ గైడ్ చేస్తున్నట్లు సమాచారం.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. సతీష్ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం. బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. దీంతో విషయం జనాల్లోకి పోవడంతో ఆమెను గప్‌చుప్‌గా వదిలేశారు.
ఈ క్రమంలో బాధితురాలి గురించి కథనాలు ఇచ్చిన సాక్షికి నోటీసులు జారీ చేసింది. బీఎన్‌ఎస్ 94 ప్రకారం.. ప్రస్తారం చేసిన కథనాలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. అలాగే.. సతీష్ అకృత్యాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ చాటింగ్(ఇందులో మంత్రి కుమారుడి చాటింగ్ కూడా) ఉన్న ఫోన్‌ను ఇప్పటికే ఆమె పోలీసులకు అప్పగించారు. పోలీసులు అవేవీ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆమె వెనక ఎవరైనా ఉన్నారా? అని ఆరాలు తీస్తున్నారు. తద్వారా విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసేలా కనిపిస్తోంది.
సంబంధిత కథనం: మంత్రి కొడుక్కి నీపై మనసైంది!


