నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పడి ఛస్తున్నారు
వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను
ఒంటరి మహిళకు మంత్రి అనధికారిక పీఏ వేధింపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మంత్రిగారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్లు. నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిఛస్తున్నారు. వాళ్లతో గడుపు. సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను’ భర్త చనిపోయిన బాధలో ఉండి గుండెజబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవనం సాగిస్తున్న ఓ మహిళకు మంత్రి అనధికార పీఏ వేధింపులు ఇవి. బాధితురాలి కథనం ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఉపాధ్యాయుడు 2021లో కరోనాతో మరణించారు.
ఆయన భార్య కారుణ్య నియామకం కోసం ప్రయత్నిస్తుండగా.. ఆ వీధిలోనే ఉండే సతీష్ జోక్యం చేసుకున్నాడు. ఆ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి అనధికార పీఏగా వ్యవహరిస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. ఖర్చులు ఉంటాయని రూ.5 లక్షలు గుంజాడు. లోబర్చుకునేందుకు యత్నించాడు.
చివరకు ఆ మహిళకు విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. తన ఉద్యోగం కోసం జిల్లా పరిషత్‌లో సతీష్ ఎవరికీ లంచాలు ఇవ్వలేదని తెలిసి బాధితురాలు నిలదీసింది. దీంతో పగ పెంచుకుని, ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల స్కూల్‌కు బదిలీ చేయించాడు.
మంత్రికి విన్నవించినా..
ఆకస్మిక బదిలీతో హతాశురాలైన మహిళ తాను ఉద్యోగంలో చేరి ఏడాదిన్నరే అయిందని, గుండె జబ్బుతో బాధపడుతున్న బిడ్డ ఉందని, అత్యవసరమైతే మారుమూల గిరిజన గ్రామంలో వైద్యం దొరకదని జిల్లా మంత్రికి మొరపెట్టుకుంది. సతీష్ తన దగ్గర డబ్బు తీసుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. మంత్రి.. సతీష్ నే వెనుకేసుకొచ్చారు. బాధితురాలు విద్యాశాఖ మంత్రి పేషీని సంప్రదించింది. అక్రమ బదిలీపై హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అయినా ఆగని వేధింపులు
‘డబ్బులు తిరిగిచ్చేది లేదు. టీడీపీలో చాలామంది నాయకులు నువ్వంటే పడి ఛస్తున్నారు. వాళ్లతో గడపకపోతే సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను’ అంటూ సతీష్ ఆ మహిళకు మెసేజ్‌లు పంపాడు. బాధితురాలి ఇంటికి టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లను పంపి బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని మంత్రికి చెప్పుకుందామని బాధితురాలు వెళ్లగా.. అక్కడా ఆమెపైన, ఆమె బంధువులపైన సతీష్ కు చెందినవారు దాడి చేశారు. పోలీసులను సంప్రదిస్తే పట్టించుకోలేదు.


