క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదికలో 9వ స్థానం
1995–2024 మధ్య 430 వాతావరణ విపత్తులు
80వేల మంది మృత్యువాత.. రూ.14 లక్షల కోట్ల నష్టం
తుపానులు, వరదలు, ఉష్ణోగ్రతలే ప్రధాన కారణం
ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ నష్టం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న టాప్ 10 దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. జర్మన్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన క్‌లైమేట్ రిస్క్ ఇండెక్స్–2026 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 1995 నుంచి 2024 వరకు మన దేశం సుమారు 430 విపత్తుల బారిన పడినట్లు ఈ నివేదిక పేర్కొంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు లక్షల మందిపై ప్రభావం చూపడంతో సుమారు 80 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు.
అంతేగాక, ఆర్థికంగా దేశానికి రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల 50 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో వడ దెబ్బ తగిలి వందలాది మంది చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర తీర ప్రాంతాలను తుపానులు తీవ్రంగా దెబ్బతీశాయి.
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉంటున్నాయి. రుతుపవనాల సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల వరదల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పంటలు, ఇళ్లు, రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. వాతావరణ హెచ్చరికలు, అరకొర రక్షణ చర్యల వల్ల నష్ట తీవ్రత మరింత పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 9,700 విపత్తులు
అంతర్జాతీయంగానూ వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది విడుదలైన సీఓపీ30 నివేదికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా భారత్ వంటి దేశాలు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నాయని హెచ్చరించింది. 1995 నుంచి 2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 9,700పైగా అత్యంత ప్రభావం చూపిన వాతావరణ విపత్తులు వచ్చాయి.
అమెరికాలో కత్రీనా, ఫిలిప్పీన్స్‌లో హైయాన్, ఇండియాలో ఆంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపాయి. చైనా, పాకిస్తాన్, ఇండియా, జర్మనీ తదితర దేశాల్లో భారీ వరదలు వచ్చాయి. యూరప్, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జపాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. హిమాలయ ప్రాంతాలు, దక్షిణ అమెరికాలో కొండలు కూలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల్లో నీటి కొరత, పంటల నష్టం, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల అడవుల్లో తీవ్ర అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
భారత్‌లో తీవ్ర విపత్తులు
మన దేశంలో 1999లో ఒడిశాలో సంభవించిన సూపర్ సైక్లోన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2014లో హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగల్చగా.. 2013–2021 మధ్య ఫాలిన్, గజా, తిత్లీ, ఆంఫన్, యాస్ తుపానులు పెను నష్టాన్ని కలిగించాయి. 2005లో ముంబైలో వచ్చిన వరదలు, 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2018లో కేరళలో వరదలు ఆ రాష్ట్రాల్లో ఊహించని నష్టాన్ని కలిగించాయి. ఏటా గంగ, గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు తరచూ కరువు బారిన పడడంతో వ్యవసాయానికి తీరని నష్టం మిగులుతోంది. హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడడం, కూలిపోవడం (ల్యాండ్ స్లైడ్స్) వల్ల అపార నష్టం వాటిల్లుతోంది.
వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల్లో అస్థిరత, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో వరదలు రావడం, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతోంది. తీర ప్రాంతాల్లో అధిక జనాభా, ప్రణాళిక లోపాలతో తీవ్ర నష్టం జరుగుతోంది. అడవుల ధ్వంసం, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం వల్ల నష్టం ఎక్కువ అవుతున్నట్లు నివేదిక వెల్లడించింది.


