సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి.. విడుదల చేస్తామని ఇప్పటికీ అందించలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులను మభ్యపెట్టి.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో దోహదం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. వారికి డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి విడుదల చేస్తామని ఇప్పటికీ అందించడం లేదు. వైఎస్ జగన్ హయాంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శత్రువుగా మారిపోయింది. టీచర్స్ పట్ల టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, సచివాలయంలో లక్ష సమస్యలుగా కూటమి ప్రభుత్వం మారింది.
ఉద్యోగులకు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా తుంగలో తొక్కారు. రూ.34వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ అందిస్తామని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పీఆర్సీ ఇస్తామని ఆ ఊసే లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రస్తావించడం లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేయకుండా మభ్యపెడుతున్నారు.
గతంలో వైఎస్ జగన్ హయాంలో ఐఆర్ 27 శాతం అందించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకోని ఉద్యోగులకు అందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. 16 నెలలు అవుతున్నా డీఏలు అందించడం లేదు. వైఎస్ జగన్ కరోనా సమయంలో కూడా ఐఆర్, డీఏలు, పీఆర్సీ అందించారు. మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగులకు ఎందుకు బకాయిలు చెల్లించలేదు?. సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని కామెంట్స్ చేశారు.


