‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే.. | Men Pongal: Thippaya Palle Sri Sanjeevaraya Temple Specialty | Sakshi
Sakshi News home page

‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే..

Jan 11 2026 4:41 PM | Updated on Jan 11 2026 5:05 PM

Men Pongal: Thippaya Palle Sri Sanjeevaraya Temple Specialty

సాక్షి, అన్నమయ్య జిల్లా: పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ‘మగవారి పొంగళ్లు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీసంజీవరాయ స్వామికి మగవారు పూజలు చేయడం.. పొంగళ్లు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నేడు ఒక్కరోజు ఇక్కడ ఆడవారికి ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. స్వామివారి నైవేద్యం కూడా ఆడవారు తినడం నిషేధం.

ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మగవారి పొంగళ్లకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాధారణంగా మహిళలు మాత్రమే పొంగళ్లు వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ.. తిప్పాయపల్లెలో మాత్రం పురుషులే పొంగళ్లు వండి స్వామి వారికి సమర్పించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఆలయం వెలపల నుంచే దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

స్థల పురాణం..
ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది. పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజల కష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.

 

అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement