గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు | The Doors of these two temples remain open even during the Eclipse | Sakshi
Sakshi News home page

గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు

Feb 26 2026 11:36 AM | Updated on Feb 26 2026 11:43 AM

The Doors of these two temples remain open even during the Eclipse

గ్రహణంలోనూతెరిచే ఉండే ఆలయాలు
సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేసి, గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేసి భక్తుల సందర్శనార్థం అనుమతించడం అనేది ఆచారం. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ఆ ఆలయాలేమిటో తెలుసుకుందాం...

గ్రహణసమయంలో కూడా తెరిచే ఉండే ఆలయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెదకాకానిలోని కోటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనవి. తమిళనాట గల అరుణాచల క్షేత్రం సరేసరి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడమే ఇందుకు కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని విశ్వాసం. 

మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.

గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.

మహా కాళేశ్వర్‌ ఆలయం... ఉజ్జయిని  
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండనందువల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. 

ఏ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం: ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.

ఏ కల్పేశ్వర్‌ ఆలయం – ఉత్తరాఖండ్‌ : గ్రహణ సమయంలో కూడా ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్‌ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయి. 

ఏ తిరువరప్పు శ్రీ కృష్ణ ఆలయం – కొట్టాయం 
ఏ కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. ఏ విష్ణుపాద ఆలయం – గయ: ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట.

ఏ లక్ష్మీనాథ్‌ ఆలయం – బికనీర్, ఏ రాజస్థాన్‌ రాష్ట్రం బికనీర్‌లోని లక్ష్మీనాథ్‌ ఆలయం. దీన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరు. ఎందుకంటే ఓసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.
(మార్చి 3 బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement