సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు నిర్వహించి వేల కోట్లు దోపిడి చేసేలా కూటమి నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా 450కి పైగా బరులు సిద్ధం చేశారని, ప్రతి నిర్వాహకుడి నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
అంతే కాకుండా ఒక్కో బరి వద్ద సగటున 40 వరకు పందేలు నిర్వహిస్తారని, ఒక్కో పందెం విలువ విలువ రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులకు వాటాలు చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇవే కాకుండా ఆ కోడి పందేల బరుల వద్ద ఫుడ్ స్టాళ్లు, లిక్కర్ అమ్మకాలు, కూల్ డ్రింక్స్, పేకాట డెన్‌లు నిర్వహిస్తూ అధికార పార్టీ నాయకులు మరో భారీ దోపిడీకి తెరదీశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
సంక్రాంతి సంబరాల్లో ‘కేపీఎల్’:
క్రికెట్‌లో ఐపీఎల్ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్’ (కోడి పందేల లీగ్)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు చేశారు. అసలు కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, పోలీసులతో కుమ్మక్కై వాటి ద్వారా వేల కోట్లు దోచుకునేందుకు కూటమి నాయకులు ఈ సంక్రాంతి సంబరాల్లో స్కెచ్ వేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి రూ.10 లక్షలు ముట్టజెప్పి పందేలు నిర్వహించుకుందామని, మూడు రోజుల తమకు అదే పని అంటూ వారు మాట్లాడుకున్న వీడియో ఇందుకు సాక్ష్యం.
పండగ వేడుకలనూ ఈవెంట్‌లా మార్చారు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పులు, ఈవెంట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. పెన్షన్ పంపిణీ పేరుతో ప్రతి నెలా 1న సీఎం చేస్తున్న ఈవెంట్, ఏటా స్కూళ్లలో రొటీన్‌గా జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను కూడా ఏ స్థాయిలో ఈవెంట్‌లా మార్చి హంగామా చేశారో చూశాం. ఇప్పుడు చివరకు సంక్రాంతి పండగను కూడా విడిచిపెట్టకుండా, ఆ వేడుకలను కూడా ఈవెంట్‌లా మార్చి దోపిడికి సిద్ధమయ్యారు. ఇటీవలే దసరా సందర్భంగా విజయవాడలో గొల్లపూడి వద్ద ఎగ్జిబిషన్ నిర్వహించి ఏం చేశారో చూశాం. కాగా, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలనూ ఈవెంట్‌లా మార్చిన కూటమి నాయకులు, యథేచ్ఛగా వేల కోట్ల దోపిడి పర్వానికి తెర తీశారని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు.


