రథ చక్రం కింద ఇరుక్కుపోయిన భక్తులు
కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశృతి
40 నిమిషాల పాటు రథం చక్రాల కిందే విలవిల్లాడిన ఆరుగురు
రథంపైనే ఉన్నా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. తిరువీధుల్లో దక్షిణ గోపురం వద్దకు రథం రాగానే.. తోపులాట జరిగి ఆరుగురు భక్తులు రథం ముందు చక్రం కింద ఒకరిపై ఒకరు పడిపోయారు. జాకీ తీసుకొచ్చి రథాన్ని పైకి లేపేవరకూ 40 నిమిషాలపాటు వారు చక్రాల కిందే ఉండి నలిగిపోయి విలవిల్లాడిపోయారు.
ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో భక్తులు అల్లాడారు. ఇంత జరుగుతున్నా రథం ముందు భాగంలో కూర్చున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఖాద్రీశుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడం భక్తుల్లో అలజడి రేపింది.

వరుస ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యమే
రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తొలి ఏడాదే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో విఫలమవడంతో ఆరుగురు భక్తుల మృతి చెందగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు, కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది మరణించారు. మహాశివరాత్రి వేళ శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది.
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో గోక్షీరంలో పురుగులు దర్శనమివ్వడం, విద్యుత్ నిలిచిపోవడం వంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడంతో వరుస అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖాద్రీశుడి రథోత్సవాన్ని వీక్షించేందుకు మూడు లక్షల మందికి హాజరుకాగా.. తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
యథాస్థానానికి చేరిన రథం
భక్తజన గోవింద నామస్మరణల మధ్య మంగళవారం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయాన్నే ఆలయ అర్చక బృందం తేరు ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించింది. ఉదయం 8.25 నుంచి 8.45 గంటల మధ్య ముహూర్తం నిర్ణయించగా.. రథం 9.35 గంటలకు ముందుకు కదిలింది. ఓ వైపు ఎండ మండిపోతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్కచేయకుండా స్వామివారి సేవలో తరించారు. తమ ఇలవేల్పును దర్శించుకుని రథంపైకి దవణం, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 3.08 గంటలకు బ్రహ్మరథం యథాస్థానానికి చేరుకుంది.
క్షతగాత్రుల వివరాలివీ..
ఈ ఘటనలో కదిరిలోని గజ్జలరెడ్డిపల్లికి చెందిన జయశేఖర్, ఆంజనేయులు, నల్లచెరువు మండలం దిగువపల్లికి చెందిన వెంకటేశు, గోరంట్ల మండలం కొండాపురానికి చెందిన రామాంజనేయులు, నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన అంజనీకుమార్, బుక్కపట్నం మండలం గసికవారిపల్లికి చెందిన సాయికుమార్ గాయపడ్డారు. వీరందరికీ కాళ్లు విరగడంతో నరకం చూశారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన జయశేఖర్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు.


