మద్యంపై అక్రమ కేసులో బాబు సర్కార్‌కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు లొంగుబాటు నుంచి మినహాయింపు
ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి బెయిల్‌పై కొనసాగుతారని వెల్లడి
26వ తేదీలోపు లొంగిపోవాలంటూ హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులపై స్టే
200 మంది సాక్షులుంటే... విచారణకు ఎంత సమయం పడుతుందో..అంతకాలం వీరిని జైల్లో ఉంచడం సరికాదు
సిట్ ఆందోళనకు అరెస్ట్ పరిష్కారం కాదు
కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌కు సుప్రీం నోటీసులు
తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం (నవంబర్ 26న) వారు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వారిని కస్టడీలో ఉంచితే దానితో ఏ ప్రయోజనం ఒనగూరుతుందో మీరు చెప్పాలి. వారిలో ఒకరు సీనియర్ అధికారి అని మాకు తెలుసు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మీరు భావిస్తే దానికి తగిన షరతులు విధించవచ్చు.
అంతేకానీ అరెస్ట్ పరిష్కారం కాబోదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభుత్వం) చెబుతున్నారు. కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు విచారణ పూర్తయ్యేందుకు మీరు ఎంతకాలం తీసుకుంటారు?’ అని ప్రశ్నించింది.
తదనంతరం సరెండర్ నుంచి పిటిషనర్లకు మినహాయింపునిస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి వారు డిఫాల్ట్ బెయిల్‌పై కొనసాగుతారని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం 10రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రిజాయిండర్‌కు పిటిషనర్లకు మరో 5రోజులు గడువు మంజూరు చేస్తూ విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.
అకడమిక్ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదు
బెయిల్ మంజూరు సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ అగర్వాల్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ కేసులో దాదాపు 400 మంది సాక్షులు ఉన్నారని, ఇప్పటికి ఇంకా 200 మందికి పైగా సాక్షులను విచారించాల్సి ఉందన్నారు.
‘మొదట ట్రయల్ కోర్టు మా చార్జ్ షీట్‌ను విస్మరించింది. ఇప్పుడు చార్జ్ షీట్‌ను తగిన విధంగా సమర్పించాం. ట్రయల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా నివేదించగా, దీనిపై చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటూ, ‘కోర్టు సమయం వృథా అయ్యే అకడమిక్ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
‘కస్టడీ’పై సీజేఐ కీలక ప్రశ్నలు
» 200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభుత్వం) చెబుతున్నారు. కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాంం. అలాంటప్పుడు విచారణ పూర్తయ్యేందుకు మీరు ఎంతకాలం తీసుకుంటారు?
» పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాలన్న కారణంతో ఒక వ్యక్తిని చాలా కాలం జైలులో ఉంచడం సరైంది కాదు.
» హైకోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వ (సిట్) తీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు. కీలక వ్యాఖ్యలు, సూచనలు చేశారు.
» నిందితులను ఇప్పుడు కస్టడీలో ఉంచడం వల్ల కొత్తగా సాధించేదేముంది?
» రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఆధారంగానే నిందితునికి బెయిల్ రావాలని భావించడం వల్ల (న్యాయమైన విచారణకు భంగం లేకుండా నిందితుడికి స్వేచ్ఛ ఇవ్వవచ్చని కోర్టు భావించేంతవరకూ) డిఫాల్ట్ బెయిల్ విషయంలో అనేక పిటిషన్లు చివరకు నిరర్థకంగా మారుతున్నాయి.
» సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఆందోళన ఉంటే, కఠినమైన షరతులు విధించి బెయిల్ ఇవ్వవచ్చు.
» అంతేకానీ అరెస్ట్ పరిష్కారం కాదు.
దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదు
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు బలమైన వాదనలు వినిపించారు. దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదన్న పిటిషనర్ల వాదనలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ. దర్యాప్తు పూర్తయ్యాక అరెస్ట్ చేయడం అన్యాయం. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్లు బుధవారం సరెండర్ కావాల్సి ఉంది. ఈ కేసు విచారణ అత్యవసరం. నిందితులు ఇప్పటికే 108 రోజులు కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ నుంచి బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేయడం అన్యాయం.
దర్యాప్తు సంస్థ గడువులోగా పూర్తి చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. సాంకేతిక కారణాలతో బెయిల్ రద్దు చేయడం సరికాదు. దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదు. అసంపూర్ణ చార్జ్‌షీట్ దాఖలైనప్పుడు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ హక్కు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై సుప్రీంకోర్టులోనే భిన్న తీర్పులు ఉన్నాయి. రీతు ఛబ్రియా కేసులో దర్యాప్తు పూర్తి కాకుండా కేవలం చార్జ్ షీట్ వేసినంత మాత్రాన నిందితుడు డిఫాల్ట్ బెయిల్ హక్కు కోల్పోడని తీర్పు ఉంది.
కపిల్ వాధ్వాన్ కేసులో చార్జ్ షీట్ వేసి, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటే ఇక డిఫాల్ట్ బెయిల్ రాదని పేర్కొన్నారు. ఈ న్యాయపరమైన వైరుధ్యంపై స్పష్టత కోసం ’మన్‌ప్రీత్ తల్వార్’ కేసును ఇప్పటికే ముగ్గురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఆ కేసులో తీర్పు వచ్చేంతవరకు, లేదా ఈ కేసులో తదుపరి విచారణ జరిగేంతవరకు నిందితుల స్వేచ్ఛను హరించడం సరికాదు.
అసలేం జరిగింది?
నిర్దేశిత గడువులోగా చార్జ్ షీట్ దాఖలు కానందున ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్పకు గతంలో ట్రయల్ కోర్టు ‘డీఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


