ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు | Legal Advice: Holding original documents of a candidate for Job is Legal | Sakshi
Sakshi News home page

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు

Nov 26 2025 12:00 PM | Updated on Nov 26 2025 12:00 PM

Legal Advice: Holding original documents of a candidate for Job is Legal

9 నెలల క్రితం ఒక ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. నియామక సమయంలో మూడు సంవత్సరాల పాటు బాండు రాయించుకున్నారు. ట్రైనింగ్‌ ఇస్తాము అని చెప్పారు కానీ ఒక నెలరోజులు వీడియోలు చూపించి, తర్వాత టీం లీడర్‌ చెప్పిన పని చేయిస్తున్నారు. దానికి మళ్ళీ టార్గెట్స్‌ కూడా. రోజుకి 9 గంటల పని వేళలు కాస్తా 12–13 గంటలు చేయవలసి వస్తోంది. జీతం కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదు. ఇదేమిటి అని అడిగితే, 10 లక్షల జరిమానా కట్టి రిజైన్‌ చేయమని అంటున్నారు. నాకు వేరే కంపెనీలో ఉద్యోగాలు చూసుకోవాలి అని ఉంది కానీ ఇదే సాఫ్ట్‌వేర్‌లో నేను ఒక సంవత్సరం పాటు పనిచేయడానికి వీలు లేదు అని కూడా అగ్రిమెంట్‌లో రాసి ఉంది. ఈ టార్చర్‌ తట్టుకోలేను. ఇప్పుడు నేను మానేస్తే వాళ్ళకి 10 లక్షలు కట్టాలా? ఇలాంటి బాండ్లు చెల్లుతాయా? నా సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గిరే ఉన్నాయి.
– రాజ్‌ కుమార్, హైదరాబాదు

యాజమాన్యాలు ఇలాంటి కాంట్రాక్టులు రాయించుకోవడం చట్టరీత్యా తప్పేమీ కాదు. సాధారణంగా ఒక వ్యక్తిని చట్టబద్ధమైన ఉద్యోగం, వ్యాపారం మొదలైనవి చేసుకోనివ్వకుండా అగ్రిమెంటు అయినా కాంట్రాక్టు అయినా, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ చట్టం లోని సెక్షన్‌ 27 ప్రకారం చెల్లవు. మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరొక సంస్థలో కూడా పనిచేస్తాను; సెక్షన్‌ 27 ప్రకారం నన్ను ఆపడానికి వీల్లేదు అంటే తప్పు కానీ, ఒక ఉద్యోగం మానేసిన తర్వాత మీరు ఫలానా పని చేయడానికి వీల్లేదు అని మీ మీద నిబంధన పెట్టడం కుదరదు. 

అగ్రిమెంట్‌లో కూడా అసమంజసమైన, అసంబద్ధమైన నిబంధనలు ఉండకూడదు. మీరు పది లక్షలు జరిమానా కట్టాలి అంటే, మీకు నెలకి కనీసం మూడు లక్షల పైన జీతం ఉండి ఉండాలి. కూడా అలా ఉందా? ఎందుకంటే... మీకు కంపెనీ వారు ఇచ్చిన ట్రైనింగ్‌ విలువ వారు విధించే జరిమానాకి, వారికి జరుగుతుంది అనుకునే నష్టానికి పరిహారం లాగా ఉండాలి తప్ప మీకు శిక్ష విధించే లాగా, కక్ష సాధింపులాగా ఉండకూడదు. ఇకపోతే మీరు అసలు సర్టిఫికెట్లు వాళ్లకి ఎందుకు ఇచ్చారు? ఏ కంపెనీకి, ఏ వ్యవస్థకి కూడా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసి వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు. 

వెరిఫికేషన్‌ కోసం లేదా ధ్రువీకరణ కోసం వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలించి మీకు తిరిగి అందజేయవలసి ఉంటుంది. మీరు మీ సర్టిఫికెట్లను తిరిగి తీసుకోండి. అవసరం అనుకుంటే లీగల్‌ నోటీసు ఇచ్చి మరీ తీసుకోండి. మీకు వేరే చోట ఉద్యోగం వస్తే ఇక్కడ రిజైన్‌ చేసి మీ కెరియర్‌ మీరు చూసుకోండి. 

అయితే పది లక్షలు కాకుండా ఎంతో కొంత పరిహారం కట్టవలసిన పరిస్థితి వస్తుందా లేదా అనేది మీ అగ్రిమెంట్, ఆఫర్‌ లెటర్, అ΄ాయింట్‌మెంట్‌ లెటర్‌; అన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పగలము. ఎవరైనా ఒక న్యాయవాదిని కలిసి మీ పత్రాలను చూపించిన తర్వాత ఇంకా క్షుణ్ణమైన నిర్ణయం తీసుకోవచ్చు. భయపడవలసిన పనేమీ లేదు. 

(చదవండి: Michelle Obama: స్లిమ్‌గా మిచెల్‌ ఒబామా..! ఆమె కూడా ఒజెంపిక్‌ తీసుకున్నారా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement