మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్లు. అందరికీ 1990లలోనే పెళ్ళిళ్లు కూడా అయిపోయాయి. మా నాన్నగారి తల్లిగారి పేరిట ఉన్న ఆస్తిని, తను చనిపోయాక మా నాన్నగారు తన పేరుతో పట్టా పాస్ పుస్తకం తీసుకున్నారు. కొంత భూమిని అమ్మే క్రమంలో కొనేవారు మా అత్తయ్యల అంగీకారం కూడా కావాలి అని అడిగారు. అయితే అందుకు అత్తయ్యలు అంగీకరించలేదు. మా నాన్నగారు వాళ్లకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు మా నలుగురు అత్తయ్యలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి.
– ఫణీంద్ర, చిత్తూరు జిల్లా
ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఇక వారికి ఆస్తిలో ఎటువంటి భాగమూ ఉండదు అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. పూర్వికులు ఆస్తి మగవారి హక్కు అని ఆడవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. మీ అత్తయ్య గార్లకి పెళ్ళిళ్లు చేయకముందు – చేసిన తర్వాత కూడా ఆస్తిని మీ నాన్నగారు – మీరే కదా అనుభవిస్తున్నారు? మీరు అనుభవించిన దానితో పోలిస్తే వాళ్లకి చేసిన పెళ్ళిళ్లు సరితూగుతాయా? చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ సమాజంలో ఇంకా రాలేదు.
ఆడపిల్లలకు/స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కులను చట్టం కల్పించినప్పటికీ తమ హక్కు కోసం ఎంతోమంది మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏది ఏమైనా, హిందూ వారసత్వ (సవరించబడిన) చట్టం, 2005 లోని సెక్షన్ 6 ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయి.
ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మరోసారి తేల్చి చెప్పింది. మీరు వివరించిన దాని ప్రకారం మీకు సెక్షన్ 15 వర్తిస్తుంది. వీలునామా రాయకుండా మరణించిన మహిళ ఆస్తి సెక్షన్ 15 ప్రకారం తన వారసులకు అనగా:
1. ప్రథమంగా కొడుకులకు (లేని పక్షంలో అతని వారసులకు), కూతుళ్ళకు (లేని పక్షంలో ఆమె వారసులకు) – భర్తకు సమానంగా సంక్రమిస్తుంది.
2. ద్వితీయంగా భర్త వారసులకు
3. తృతీయంగా తల్లి – తండ్రులకు
4. లేదా నాలుగవ పక్షంలో తండ్రి గారి వారసులకు
5. ఆఖరున తల్లిగారి వారసులకు;
ఇలా క్రమపద్ధతిలో మొదటివారు, లేదా రెండవ వారు, ఎవరూ లేకుంటే ఆఖరున సూచించినవారికి ఆస్తి సంక్రమిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు ఆస్తి పంపకాలు (పార్టిషన్) జరిగి ఉంటే తప్ప, స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే! పెళ్ళి చేశాము, కట్నం ఇచ్చాము, పురుడు పోశాము, సంక్రాంతికి కొత్త బట్టలు కొన్నాము అంటే కుదరదు. వారి హక్కును వారికి ఇవ్వండి. వారి ఆస్తిని వారికి ఇవ్వండి. మీ అత్తయ్యలకి తెలియకుండా ఆస్తిని అమ్మేస్తే అది మోసం చేసినట్టే. అలాంటి అమ్మకం చెల్లదు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
(చదవండి: మ్యాడ్ హనీ గురించి విన్నారా..? కానీ ఒక్క చుక్క తాగినా అంతే సంగతులు..)


