వయసు పెరిగే కొద్దీ బయటపడుతున్న మార్పు
మహిళల కంటే వేగంగా పురుషుల మెదళ్లు కుంచించుకుపోతున్నాయి
అర్థం చేసుకోవడానికి వేలాది ఎమ్మారై స్కాన్ విశ్లేషణ...
ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
మహిళల కంటే వేగంగా పురుషుల మెదళ్లు కుంచించుకుపోతున్నాయి...వయసు పెరిగే కొద్దీ ఈ మార్పు బయటపడుతోంది...ఇది మెదడు ఆరోగ్యంలో తేడాలు, చిత్త వైకల్యం ప్రమాదం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది...పురుషుల మెదళ్లు వయసు పెరిగే కొద్దీ మహిళల కంటే వేగంగా కుంచించుకుపోతున్నాయని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో భాగంగా... పురుషులు– మహిళల మెదడు వయస్సు ఎలా భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వేలాది ఎమ్మారై స్కాన్‌లను విశ్లేషించారు. కాలక్రమేణా మెదడు నిర్మాణంలో మార్పులను ట్రాక్ చేయడానికి పరిశోధకులు 17 నుంచి 95 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దల నుంచి 12,000 కంటే ఎక్కువ ఎమ్మారై స్కాన్‌లను పరిశీలించారు.
ముఖ్యాంశాలు...
⇒ పురుషులలో కార్టెక్స్ (మెదడు పైభాగాన పొరగా కప్పబడిన పదార్థం), సబ్‌కార్టెక్స్ ప్రాంతాలతో సహా అనేక మెదడు ప్రాంతాలలో నిర్మాణాత్మక క్షీణత ఎక్కువగా ఉంది.
⇒ మహిళలలో మొత్తం సంకోచం తక్కువగా కనిపించింది. అయినా వృద్ధాప్యంలో ద్రవంతో నిండిన జఠరికల విస్తరణ పెరుగుదల ఉంది.
⇒ లింగాల మధ్య మెదడు పరిమాణంలో తేడాలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ మార్పులు గమనించారు.
⇒ పురుషుల మెదళ్లు మహిళల కంటే నిర్మాణ స్థాయిలో త్వరగా వృద్ధాప్యం చెందుతాయని నిర్ధారించారు.
⇒ ఆయురార్థంలో తేడాలను పరిగణించిన తర్వాత, పురుషులు, స్త్రీల మధ్య అనేక మెదడు–వృద్ధాప్య అసమానతలు తగ్గాయి.
⇒ ఇది వృద్ధాప్య స్త్రీ మెదడుపై మరింత సూక్ష్మ పరిశోధన అవసరాన్ని సూచిస్తుంది.
ఇది ఎందుకు కీలకం ?
మెదడు సంకోచం తరచుగా క్షీణత అని పిలుస్తారు, ఇది వృద్ధాప్యంలో సహజమైన ప్రక్రియే అయినా ఈ సంకోచం యొక్క వేగం, నమూనా విస్తృతంగా మారొచ్చు. ఈ ప్రక్రియలో లింగ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల, చిత్తవైకల్యం అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని వయస్సు సంబంధిత పరిస్థితులు పురుషులు–మహిళలను భిన్నంగా ఎందుకు ప్రభావితం చేస్తాయో శాస్త్రవేత్తలు గుర్తించడంలో ఈ అధ్యయనం సహాయపడుతుంది. ఆసక్తికరంగా, పురుషుల మెదళ్లు వేగంగా కుంచించుకుపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లోనే అధికంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలే.
పురుషుల మెదడుల్లో నిర్మాణాత్మక వృద్ధాప్యం వేగంగా ఉన్నప్పటికీ, ఈ తేడాలు మహిళలకు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉందనే దానికి కారణాలు కనుక్కోలేకపోయారు. హార్మోన్లు, జన్యుశాస్త్రం, జీవనశైలి లేదా జీవరసాయన మార్పులు వంటి ఇతర అంశాలు మహిళల చిత్తవైకల్య ప్రమాదంలో పెద్ద పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది. ‘మహిళల మెదళ్లు మరింత క్షీణించి ఉంటే, అది వారి అధిక అల్జీమర్స్ ప్రాబల్యాన్ని వివరించడానికి సహాయపడి ఉండేది’అని నార్వే ఓస్లో విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్, సహ పరిశోధకురాలు అన్నే రావ్‌డాల్ పేర్కొన్నారు. అయితే మెదడులో వచ్చే మార్పులు, జ్ఞానం, ఆరోగ్యానికి అర్థం ఏమిటో పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు గుర్తించారు.
అధ్యయన పరిమితులు...
⇒ ఎమ్మారై– ఆధారిత విశ్లేషణ మెదడు వృద్ధాప్య నమూనాలను చూపుతుంది కానీ అంతర్లీన జీవసంబంధమైన కారణాలను వివరించలేదు.
⇒ ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి సారించారు. పాల్గొనేవారికి నాడీ సంబంధిత వ్యాధి నిర్ధారణ కాలేదు.
⇒ ఈ మార్పులు అల్జీమర్స్ పురోగతికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై అంతర్దృషు్టలను పరిమితం చేస్తాయి.
⇒ఈ అధ్యయనం అభిజ్ఞా పనితీరు లేదా జ్ఞాపకశక్తి ఫలితాలను కాకుండా మెదడు వాల్యూమ్ మార్పులను అంచనా వేసింది.
⇒ ముఖ్యమైన ప్రమాద కారకాలు కొలవలేదు.. హార్మోన్ల స్థితి, జన్యుపరమైన ప్రమాదం, జీవనశైలి ప్రభావాలను నేరుగా విశ్లేషించలేదు.


