‘పర్యావరణ నిర్లక్ష్యం జాతి మనుగడకు అత్యంత ప్రమాదకరం’ | Environmental Negligence The Greatest Threat to Human Survival | Sakshi
Sakshi News home page

‘పర్యావరణ నిర్లక్ష్యం జాతి మనుగడకు అత్యంత ప్రమాదకరం’

Feb 8 2026 8:51 PM | Updated on Feb 8 2026 8:51 PM

Environmental Negligence The Greatest Threat to Human Survival

పర్యావరణాన్ని  మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి, మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.

రంగారెడ్డి జిల్లా kadtal మండలం అన్మాసుపల్లిలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తాద్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సమావేశంలో జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి తదితర ముఖ్యులు పాల్గొన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాల గ్రేడింగ్ తో ప్రకృతి వ్యవసాయం లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాలు దేశ సంపద అని, వాటి విస్తృత వినియోగానికి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ప్రణాళికా బద్దమైన ప్రభుత్వ విధానాలు అవసరం అన్నారు. రైతు ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ విధానాలు రూపొందాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల వినియోగం పెరుగుతుందన్నారు.

ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చినప్పుడే ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుందని ఏపీ మాస్ వ్యవస్థాపకులు సీఎస్ రెడ్డి  ఆన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ఈ ఉద్యమం లో కీలక పాత్ర ఉందన్నారు. దేశీ విత్తనాల తో పంట దిగుబడి తగ్గుతుందనేది కేవలం ఒక అపోహేనని , వాటి వినియోగం వల్ల భూమి, మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అనుగుణమైన ప్రత్యామ్నాయ విత్తన వ్యవస్థ ను బలోపేతం చేయాలన్నారు.

ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్, దేశీ విత్తన వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ ప్రయోజనాలతో కూడిన విత్తన వ్యవస్థను రైతులు సవాలు చేస్తూ ప్రకృతి వ్యవసాయ  ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయ భాగస్వామ్యం తో విత్తన పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు. లక్ష్యం దిశగా ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని, మరింత స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు సాగుతామని ఆమె చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement