environmental balance
-
చిట్టి చేతుల్లో పచ్చని ప్రపంచం
చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు లేకపోతే జీవం ఉండదు, పక్షులు, జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి... ఇలా ఒక్కో విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టేలానూ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మార్పులు వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైనచోట వేయడం, నీటిని పొదుపు చేయడం, వస్తువులను రీసైక్లింగ్ విధానంలో వాడటం.. ఇవన్నీ పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు.గాలి, నీరు, నేల, చెట్లు, జంతుజాలం.. ఇవన్నీ మన జీవనానికి ఆధారం. పిల్లలకు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణానికి సంబంధించి కథలు, పెయింటింగ్, ఆటల ద్వారా అవగాహన తీసుకురావచ్చు. ప్రయోగాత్మకంగా నేర్పాలంటే పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రీయ ఎరువుల తయారీ.. లాంటి పనులలో భాగస్వాములను చేయడం వల్ల వారికి ప్రకృతిపై ప్రేమను కలుగుతుంది.చిన్న ఆలోచనతో పెద్ద మార్పు...→ ప్రకృతి సహజవనరులు–ప్రతికూల అంశాల గురించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వవచ్చు. → స్థానిక పార్కుల వద్దకు తీసుకెళ్లి, చుట్టుపక్కల ఉన్న చెత్తను సేకరించడం, రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగించడం, కాలుష్య నివారణలో భాగస్వాములను చేయాలి. → గ్లోబల్ స్థాయిలో పర్యావరణంలో పిల్లలను ఇన్వాల్వ్ చేస్తున్న సంస్థలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలి. → వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ, ఎండ వేడిమి పెరగడానికి కారణాల గురించి తెలియజేయాలి.కీడు చేసే రసాయనాలు→ ఇంటి శుభ్రతలో వాడే క్లీనర్లలో ఉండే విషపూరిత రసాయనాలు, వీటి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదాల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి శుభ్రతలో సేంద్రీయ ఉత్పత్తుల తయారీని పరిచయం చేసి, పర్యావరణ హానిని తగ్గించవచ్చు. → పర్యావరణ అనుకూల వస్తువుల వాడకం వల్ల జంతువులకు, మానవ మనుగడకు ఎంత మేలు చేస్తుందో తెలియజేయవచ్చు. → ఔషధ మొక్కల ఆధారిత పదార్థాల నుండి తయారుచేసిన ఉత్పత్తులు, నీటి వ్యవస్థల గురించి అవగాహన కలిగించాలి. ఇంటా బయట మనవంతుగా కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ స్వచ్ఛత లో భాగస్వాములు అవ్వాలని చెప్పవచ్చు. → ఆన్లైన్ – ఆఫ్‌లైన్ వేదికలుగా జరిగే పర్యావరణ సంబంధిత వర్క్‌షాప్స్, కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్పిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకోసం వారికి ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ తయారీని పరిచయం చేయడం, లేదా కొనుగోలు చేసి వాటి, ఉపయోగాలను వివరించాలి. కొబ్బరిచిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టి, అందులో కోకోపిట్ నింపి, తల భాగంలో జుట్టు ఎలా అయితే ఉంటుందో, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేయవచ్చు. కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి బొమ్మ చేయవచ్చు. బొమ్మ తల భాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరుగుతాయి. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను తయారు చేయించవచ్చు. ఓల్డ్ క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లల చేత చేయించడానికి ఈ సీజన్ చాలా అనుకూలమైనది. పెద్దలు పర్యావరణాన్ని కాపాడేందుకు చేసే ప్రతి పని, పిల్లల్లో ఆలోచనను కలిగిస్తుంది. ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకునేందుకు తగిన అవగాహన ఏర్పడుతుంది. ప్రకృతికి దగ్గరగా...మన భూమిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనే ఆలోచనతో పిల్లల చేత పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రకృతికి నష్టం కలగకుండా ఎలా జీవించాలి, కమ్యూనిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం, ఎకో–ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ, వాడకం, ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతీ పనిలోనూ పిల్లల్లో మనోవికాసం వృద్ధి చెందుతుంది. – మేఘనా ముసునూరి, పర్యావరణ వేత్త, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
‘పర్యావరణ నిర్లక్ష్యం జాతి మనుగడకు అత్యంత ప్రమాదకరం’
పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి, మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లా kadtal మండలం అన్మాసుపల్లిలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తాద్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సమావేశంలో జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి తదితర ముఖ్యులు పాల్గొన్నారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాల గ్రేడింగ్ తో ప్రకృతి వ్యవసాయం లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాలు దేశ సంపద అని, వాటి విస్తృత వినియోగానికి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ప్రణాళికా బద్దమైన ప్రభుత్వ విధానాలు అవసరం అన్నారు. రైతు ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ విధానాలు రూపొందాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల వినియోగం పెరుగుతుందన్నారు.ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చినప్పుడే ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుందని ఏపీ మాస్ వ్యవస్థాపకులు సీఎస్ రెడ్డి ఆన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ఈ ఉద్యమం లో కీలక పాత్ర ఉందన్నారు. దేశీ విత్తనాల తో పంట దిగుబడి తగ్గుతుందనేది కేవలం ఒక అపోహేనని , వాటి వినియోగం వల్ల భూమి, మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అనుగుణమైన ప్రత్యామ్నాయ విత్తన వ్యవస్థ ను బలోపేతం చేయాలన్నారు.ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్, దేశీ విత్తన వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ ప్రయోజనాలతో కూడిన విత్తన వ్యవస్థను రైతులు సవాలు చేస్తూ ప్రకృతి వ్యవసాయ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయ భాగస్వామ్యం తో విత్తన పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు. లక్ష్యం దిశగా ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని, మరింత స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు సాగుతామని ఆమె చెప్పారు -
Earth Overshoot Day 2024: ఆగస్టు1 నాటికే.. అన్నీ వాడేశాం!
భూగోళం ప్రకృతి వనరులను పునరుత్పత్తి చేసుకోగలిగే వేగం కంటే.. ప్రకృతి వనరులను మనుషులు అధిక వేగంతో వాడుకుంటూ ఉండటం వల్ల ఈ ఏడాదంతా వాడుకోవాల్సిన వనరులు ఆగస్టు1 నాటికే పూర్తిగా వాడేసుకున్నట్లు గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అంటే.. రేపటి (ఆగస్టు 2) నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరూ, వాడే వనరులన్నీ ప్రకృతికి పెనుభారమే! అది తెలియజెప్పేదే ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’.ఒక విధంగా చెప్పాలంటే.. మనుషులు భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 1.7 రెట్లు వేగంగా ప్రకృతివనరులను ఖర్చు చేస్తున్నారని 2024 ఎర్త్ ఓవర్ షూట్ డే సూచిస్తోంది. ఈ పర్యావరణ లోటు ఎంత ఎక్కువగా ఉంటే.. అడవుల నిర్మూలన, నేలకోత, జీవవైవిధ్య నష్టం అంత వేగంగా జరుగుతున్నట్లు లెక్క.419 పిపిఎంకి పెరిగిన సీఓ2..భూవాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 2023 నాటికి 419.3 పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం) స్థాయికి పెరిగింది. 2022 – 2023 మధ్యలో 2.8 పిపిఎం పెరిగింది. ఏడాదికి 2 పిపిఎం కన్నా ఎక్కువగా పెరగటం వరుసగా ఇది 12వ సంవత్సరం. ఈ సాంద్రత వల్లే భూ తాపం పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం గతి తప్పి.. వాతావరణం మార్పులకు లోనవుతోంది.ఎవరు లెక్కిస్తున్నారు?కెనడాలోని యోర్క్ యూనివర్సిటీ ‘ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, ఏయే దేశాల్లో ప్రకృతి వనరుల వాడకం ఏ తీరులో ఉంటోందో లెక్కగడుతోంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 1971లో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు సరిపోతూ ఉండేది. 1973 నుంచి లోటు పెరుగుతూ వచ్చింది. 1997 అక్టోబర్ వరకు ఉండేది. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతూ 2024 ఆగస్టు 1 నాటికే పర్యావరణ వనరుల ఖాతా ఖాళీ అయే స్థితికి చేరింది.పర్యావరణ పాదముద్ర.. ఎంతమేరకు ప్రకృతి వనరులు వాడుతూ ఉంటే అంత పర్యావరణ పాదముద్ర (ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్) ఉంటుందన్నమాట. ఇది ప్రతి మనిషికి, ప్రతి దేశానికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికన్లలా ప్రకృతి వనరులు వాడితే 5 భూగోళాలు అవసరం అవుతాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రకృతి వనరుల వాడకంలో భారతీయులు పొదుపరులేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అందరూ మనలా ఉండగలిగితే 30% వనరులు మిగిలే ఉంటాయి.మీ పర్యావరణ పాదముద్ర ఎంత?దైనందిన జీవితంలో మనం చేసే ప్రతిపనికీ ప్రకృతి వనరులు ఎంతోకొంత ఖర్చవుతూనే ఉంటాయి. మనం చేసే పనులు, తినే ఆహారం, వాడే వాహన ఇంధనం, ధరించే వస్త్రాలు.. ఇలాంటివన్నీ మన పర్యావరణ పాదముద్ర స్థాయిని నిర్ణయిస్తాయి.జీవన శైలిని మార్చుకొని సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయొచ్చు.. భూతలమ్మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే పనులు తగ్గించే పనులను చేపట్టగలిగితే ఆ మేరకు.. ఎర్త్ ఓవర్ షూట్ డేని వెనక్కి జరపగలం! ఏటేటా పెరిగిపోతున్న పర్యావరణ అప్పు భారాన్ని ఆ మేరకు తగ్గించుకోగలుగుతాం. అయితే, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) ఎలాగైనా ఏటా పెరగాల్సిందే అనే మానవాళి ధోరణితో.. ఇదెంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఇవి చదవండి: వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు! -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
నెల్లూరు(బృందావనం): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంయుక్తంగా మనుమసిద్ధినగర్‌లో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా ప్రస్తుతం ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. దాదాపు 200 మొక్కలు నాటారు. మూలాపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు దువ్వూరు శరత్చంద్ర, పెనుబల్లి చంద్రారెడ్డి, నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్ఆచారి, రియాజ్, కోశాధికారి పెంచలరాజా, సభ్యులు సమద్, హరీష్‌సింగ్, మధు, కార్తీక్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


