చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు లేకపోతే జీవం ఉండదు, పక్షులు, జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి... ఇలా ఒక్కో విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టేలానూ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మార్పులు వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైనచోట వేయడం, నీటిని పొదుపు చేయడం, వస్తువులను రీసైక్లింగ్ విధానంలో వాడటం.. ఇవన్నీ పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు.
గాలి, నీరు, నేల, చెట్లు, జంతుజాలం.. ఇవన్నీ మన జీవనానికి ఆధారం. పిల్లలకు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణానికి సంబంధించి కథలు, పెయింటింగ్, ఆటల ద్వారా అవగాహన తీసుకురావచ్చు. ప్రయోగాత్మకంగా నేర్పాలంటే పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రీయ ఎరువుల తయారీ.. లాంటి పనులలో భాగస్వాములను చేయడం వల్ల వారికి ప్రకృతిపై ప్రేమను కలుగుతుంది.
చిన్న ఆలోచనతో పెద్ద మార్పు...
→ ప్రకృతి సహజవనరులు–ప్రతికూల అంశాల గురించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వవచ్చు.
→ స్థానిక పార్కుల వద్దకు తీసుకెళ్లి, చుట్టుపక్కల ఉన్న చెత్తను సేకరించడం, రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగించడం, కాలుష్య నివారణలో భాగస్వాములను చేయాలి. → గ్లోబల్ స్థాయిలో పర్యావరణంలో పిల్లలను ఇన్‌వాల్వ్ చేస్తున్న సంస్థలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలి.
→ వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ, ఎండ వేడిమి పెరగడానికి కారణాల గురించి తెలియజేయాలి.
కీడు చేసే రసాయనాలు
→ ఇంటి శుభ్రతలో వాడే క్లీనర్లలో ఉండే విషపూరిత రసాయనాలు, వీటి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదాల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి శుభ్రతలో సేంద్రీయ ఉత్పత్తుల తయారీని పరిచయం చేసి, పర్యావరణ హానిని తగ్గించవచ్చు.
→ పర్యావరణ అనుకూల వస్తువుల వాడకం వల్ల జంతువులకు, మానవ మనుగడకు ఎంత మేలు చేస్తుందో తెలియజేయవచ్చు.
→ ఔషధ మొక్కల ఆధారిత పదార్థాల నుండి తయారుచేసిన ఉత్పత్తులు, నీటి వ్యవస్థల గురించి అవగాహన కలిగించాలి. ఇంటా బయట మనవంతుగా కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ స్వచ్ఛత లో భాగస్వాములు అవ్వాలని చెప్పవచ్చు.
→ ఆన్‌లైన్ – ఆఫ్‌లైన్ వేదికలుగా జరిగే పర్యావరణ సంబంధిత వర్క్‌షాప్స్, కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్
పిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకోసం వారికి ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ తయారీని పరిచయం చేయడం, లేదా కొనుగోలు చేసి వాటి, ఉపయోగాలను వివరించాలి. కొబ్బరిచిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టి, అందులో కోకోపిట్ నింపి, తల భాగంలో జుట్టు ఎలా అయితే ఉంటుందో, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేయవచ్చు.
కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి బొమ్మ చేయవచ్చు. బొమ్మ తల భాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరుగుతాయి. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను తయారు చేయించవచ్చు. ఓల్డ్ క్లాత్స్‌తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లల చేత చేయించడానికి ఈ సీజన్ చాలా అనుకూలమైనది. పెద్దలు పర్యావరణాన్ని కాపాడేందుకు చేసే ప్రతి పని, పిల్లల్లో ఆలోచనను కలిగిస్తుంది. ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకునేందుకు తగిన అవగాహన ఏర్పడుతుంది.
ప్రకృతికి దగ్గరగా...
మన భూమిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనే ఆలోచనతో పిల్లల చేత పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రకృతికి నష్టం కలగకుండా ఎలా జీవించాలి, కమ్యూనిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం, ఎకో–ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ, వాడకం, ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతీ పనిలోనూ పిల్లల్లో మనోవికాసం వృద్ధి చెందుతుంది.
– మేఘనా ముసునూరి,
పర్యావరణ వేత్త, ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్
– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి


