ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు | Hindu organisations protest Bangladesh High Commission In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద వీహెచ్‌పీ నేతల నిరసన

Dec 23 2025 12:08 PM | Updated on Dec 23 2025 1:48 PM

Hindu organisations protest Bangladesh High Commission In Delhi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

వివరాల ప్రకారం​.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు,  దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్‌పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్‌ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిం‍దూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బంగ్లాదేశ్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్‌ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ పార్ట్‌-2 జరగాలంటూ వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. 

మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్‌లో బజరంగ్‌ దళ్‌ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాం‍డ్‌ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement