అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్‌లా ఉండేది. బిగ్‌బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి.
అందరికీ నచ్చేది ఒక్కరే
ఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్‌కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది.
బిగ్‌బాస్‌లో కామెడీ అంత ఈజీ కాదు!
మరి బిగ్‌బాస్‌లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్.
నాలుగో స్థానం..
కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను.
నువ్వే రియల్ విన్నర్
అతడి విషయంలో బిగ్‌బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్‌టైనర్స్‌కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్‌బాస్‌కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది.


