బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్‌బాస్ కలిసొస్తుంది. విన్నర్స్‌తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్.
బిగ్‌బాస్ సెలబ్రిటీస్
ఈమె తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొంది. బిగ్‌బాస్ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కాజల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ సెలబ్రిటీస్.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్‌బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్ వర్క్స్, సినిమాలు, షోస్, అవార్డ్స్ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
నెక్స్ట్ ఏంటి?
ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్‌బాస్ ట్రామా, డిప్రెషన్! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్‌లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు.
జీవితాంతం ఎదురుచూపులు
యాక్టర్స్ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్‌బాస్ సీజన్‌లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతారు. ఇంకొందరు సోషల్ మీడియా, యూట్యూబ్‌తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు.
ఫేమ్ వల్ల ఏదీ మారదు
కానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్‌గా మాయమైపోతారు. బిగ్‌బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు కానీ ఫేమ్ ఒక్కటే కెరీర్‌ను నిర్మించదు. బిగ్‌బాస్ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది.


