దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.
జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెంగర్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్‌ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.
అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.
అసలు కేసు ఏంటి?
2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్‌లో ఉంది.


