వీణా–వాణిల గౌరవానికి భంగం కలిగిస్తారా? | Dharmapuri Arvind fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

వీణా–వాణిల గౌరవానికి భంగం కలిగిస్తారా?

Feb 8 2026 3:16 AM | Updated on Feb 8 2026 3:16 AM

Dharmapuri Arvind fires on Revanth Reddy

సీఎంపై మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఎంపీ అర్వింద్‌ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: వీణా–వాణిలకు జన్మతః వచ్చిన వైకల్యాన్ని ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకు వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, స్వరాష్ట్రంలోనూ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణా–వాణిలను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అర్వింద్‌ జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. 

ఈ నెల 6వ తేదీన నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వీణా–వాణిల శారీరక స్థితిని రాజకీయ పోలికలకు వాడుకున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వారిని అవహేళన చేయడం, వారి గౌరవాన్ని కించపరచడమే. ఇది కేవలం ఆ ఇద్దరు యువతులనే కాకుండా, వైకల్యంతో పోరాడుతున్న వేలాది మందిని కించపరచడమే అవుతుంది’అని ఆయన ధ్వజమెత్తారు. 

వీణా–వాణిలు అపారమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని అర్వింద్‌ కొనియాడారు. వారు ఇప్పటికే విజయవంతంగా బీకామ్‌ పూర్తి చేశారని, అలాంటి వారిని రాజకీయ బురదలోకి లాగడం అమానవీయమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంయమనం, సున్నితత్వం పాటించాలని ఎంపీ హితవు పలికారు.  

Advertisement
 
Advertisement
Advertisement