తప్పుడు పత్రాలపై నజర్..వాస్తవ పరిస్థితిపై నివేదిక
రికార్డుల్లో ఉన్నదెక్కడ? కాలేజీ ఉన్నదెక్కడ?
చర్యలు తీసుకునే దిశగా ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. 2026–27 విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే అఫ్లియేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. కానీ ప్రతీ సంవత్సరం ఈ గడువు పొడిగిస్తూనే ఉన్నారు. గుర్తింపు రాకుండానే ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారంగా అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. టెన్త్ పరీక్షలవ్వడంతోనే విద్యార్థులను అనధికారికంగా ప్రవేశాల్లోకి లాగుతున్నాయి.సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో బోర్డు గుర్తింపు ఇవ్వడం లేదు.
ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీలకు విద్యా సంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ గుర్తింపే రావడం లేదు. కానీ ఆ కాలేజీలు క్లాసులు మాత్రం నిర్వహిస్తున్నాయి. తీరా పరీక్షల సమయంలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదని ఫైర్ సేఫ్టీ సరి్టఫికెట్లు లేకున్నా గుర్తింపు ఇస్తున్నారు. ఈ ఏడాది ఈ పరిస్థితిని దారికి తెస్తామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. సకాలంలో తనిఖీలు నిర్వహించి ఆన్‌లైన్‌లో గుర్తింపు ఇస్తామంటున్నారు. ఈమేరకు చర్యలు తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
కాలేజీ ఒకచోట...క్లాసులు మరోచోట
రాష్ట్రవ్యాప్తంగా 3286 వరకూ ఇంటర్ కాలేజీలున్నాయి. ఇందులో 417 ప్రభుత్వ కాలేజీలు. కేజీబీవీలు, గురుకులాలు పోను 1500 వరకూ ప్రైవేటు ఇంటర్ కాలేజీలుంటాయి. ప్రధానంగా వచ్చే సమస్య ప్రైవేటు కాలేజీల వద్దే. కాలేజీకి ఒక ప్రాంతంలో అఫ్లియేషన్ పొందుతారు. మరోచోట క్లాసులు నిర్వహిస్తుంటారు. దీనివల్ల విద్యార్థులకు ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడో పడుతుంటాయి. అదనపు సెక్షన్లను అనధికారికంగా నిర్వహిస్తున్నారు.
ఈ సెక్షన్లలో ఉండే విద్యార్థులను ఎక్కడో జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ప్రవేశాలు పొందినట్టు చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు వరంగల్‌లోని బ్రాంచీలో ప్రవేశాలు ఉంటున్నాయి. పరీక్ష కోసం వరంగల్ వెళ్ళాల్సి వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఇంటర్ బోర్డు అధికారులు తెలిసి కూడా పట్టించుకోవడం లేదు. అఫ్లియేషన్ ఇచ్చే ముందు జిల్లా ఇంటర్ విద్యాధికారి తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలి.
కాలేజీల వద్ద మామూళ్ళు తీసుకుని, తనిఖీకి కూడా వెళ్ళకుండా నివేదిక ఇస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు కూడా ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై కఠినంగా వ్యవహరించాలని, ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని తనిఖీలు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి భావిస్తున్నారు.
తప్పుడు పత్రాలుఇస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడి
ప్రతీ కాలేజీలో ఆట స్థలం ఉండాలి. లేబొరేటరీలు ఉండాలి. వాటికి అవసరమైన పరికరాలు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారో తెలపాలి. ప్రతీ సెక్షన్‌కు సబ్జెక్టు వారీగా అధ్యాపకులు ఉండాలి. వారికి వేతనాలు ఇస్తున్నట్టు రికార్డు ఉండాలి. వీటన్నింటికీ కాలేజీలు తప్పుడు పత్రాలు ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని ఈసారి సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రతిదీ జిల్లా అధికారులు పరిశీలించాలని, తనిఖీకి వెళ్ళినప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలివ్వాలని భావిస్తున్నారు. అదనపు సెక్షన్ల విషయంలో ఫ్యాకల్టీ రికార్డు మొత్తం ఆన్‌లైన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈసారి అఫ్లియేషన్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నామని కృష్ణ ఆదిత్య చెబుతున్నారు.


