ఎఫ్‌ఎస్‌ఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం 'కీలక ఆధారాలు ఆహుతి'? | Fire accident at Nampally forensic lab Key case documents were burnt | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌ఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం 'కీలక ఆధారాలు ఆహుతి'?

Feb 8 2026 2:46 AM | Updated on Feb 8 2026 2:46 AM

Fire accident at Nampally forensic lab Key case documents were burnt

శనివారం జరిగిన అగ్ని ప్రమాదంతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో దట్టంగా అలుముకున్న పొగలు

పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు

ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్‌ ట్యాపింగ్‌ సహా పలు కేసుల్లో కీలక ఆధారాలు బూడిద!

ఐదు ఫైరింజన్లు, ఒక రోబోతో మంటలు అదుపులోకి..  

ప్రమాదంలో ఆఫీస్‌ బాయ్‌కి అస్వస్థత.. ప్రభుత్వాస్పత్రికి తరలింపు  

సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురు ఉద్యోగులు  

షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు: డీసీపీ శిల్పవల్లి  

భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు  

ఓటుకు నోటు కేసులో ఆధారాలు మాయం చేసేందుకే..: కేటీఆర్‌ 

ప్రమాదంపై అనుమానాలు వ్యక్తంచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌/నాంపల్లి: రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (టీజీ ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్‌ఎస్‌ఎల్‌ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్‌ చేసిన హార్డ్‌డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షల కోసం ఉన్నట్లు తెలిసింది. 

ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్‌ ప్రింట్స్, బ్లడ్‌శాంపిల్స్, హార్డ్‌డిస్కులు, సెల్‌ఫోన్లు, ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్‌ ప్రాపర్టీ భద్రంగా ఉందా..? లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితోపాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్‌ పరికరాలు, కెమికల్‌ ల్యాబ్‌ మెటీరియల్‌ ఉంటుంది. ఈ ల్యాబ్‌లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఉదయం 10.20 గంటలకు... 
అగ్ని ప్రమాదం శనివారం నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఏసీ గార్డ్స్‌లో జరిగింది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ప్రయోగశాల మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్‌ బాయ్‌ క్రిష్ణ చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిఇచ్చారు. అప్పటికే ఆఫీసులో ఉన్న ముగ్గురు సిబ్బందితో కలిసి దట్టంగా వ్యాపించిన మంటలను ఆరి్పవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పొగధాటికి తట్టుకోలేక క్రిష్ణ అస్వస్థతకు గురికాగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఐదు ఫైరింజన్లు, ఒక రోబో, రెండు వాటర్‌ ట్యాంకులతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

ఎంతో శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నార్త్‌ జోన్‌ డీఐజీ శ్వేతా, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పగటి పూట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సంభవించిన భవనం పక్కనే నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్‌ ఆసుపత్రి ఉంది. మరొకవైపు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. రాత్రి వేళలో జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌తోనే జరిగిందా..? లేక ఇంకా ఏదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.  

అధికారులు స్పష్టం చేస్తేనే... 
ప్రమాదంలో హార్డ్‌ డిస్కులు, కేసుల ఫైల్స్, కంప్యూటర్లు, పేపర్స్, ప్లాస్టిక్‌ కవర్స్, శాంపిల్స్‌కు సంబంధించిన రసాయనాలు, ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అయితే, కాలిపోయిన వస్తువుల్లో ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఫోన్‌ట్యాపింగ్‌ కేసులకు సంబంధించి మొత్తం సమాచారం ఎఫ్‌ఎస్‌ఎల్‌లోనే ఉందా? అవన్నీ ఒరిజినల్స్‌ ఉన్నాయా..? లేదా ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉన్నవి కేవలం నమూనా కాపీలా..? అన్నది అధికారులు స్పష్టం చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ఒకరు మాత్రం ఈ ప్రధాన కేసుల ఆధారాలు ఇక్కడ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. 

కేసుల దర్యాప్తులో భాగంగా విశ్లేషణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపే ఏ రకమైన ఆధారాలైనా.. విశ్లేషించి నివేదిక రూపొందించిన తర్వాత వాటిని సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు లేదా ఎక్కడి నుంచి విశ్లేషణ కోసం పంపారో ఆయా యూనిట్లకు పంపుతారని తెలిపారు. కొన్ని కేసుల్లో కోర్టులు సైతం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఆధారాలు పంపుతాయని, అలాంటి కేసుల్లో విశ్లేషణ తర్వాత సదరు వస్తువులు, ఆధారాలను తిరిగి కోర్టులకే అప్పగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆధారాల విశ్లేషణ తర్వాత రూపొందించే నివేదికలకు సంబంధించిన కాపీలను మాత్రం ఎఫ్‌ఎస్‌ఎల్‌లో రికార్డు కోసం భద్రపరుస్తారని పేర్కొన్నారు. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో బహుశా అలాంటి నివేదికలకు సంబంధించిన ప్రతులు కాలిపోయే అవకాశం ఉండొచ్చని వివరించారు.   

ఈ ల్యాబ్‌లో ఏం చేస్తారంటే.. 
రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్‌ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్‌ వంటి (నార్కోటిక్‌) పదార్ధాల పరిశీలన జరుపుతారు.  

షార్ట్‌సర్క్యూతోనే...: డీసీపీ శిల్పవల్లి 
షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఆధారాలు, సాక్ష్యాలకు కేంద్రంగా ప్రయోగశాల పనిచేస్తుందన్నారు. మంటల్లో కీలకమైన ఫైల్స్‌ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని చెప్పారు.  

ఆ సమయంపైనే అనుమానాలు 
ప్రభుత్వ కార్యాలయాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. అప్పడే ఒక్కొక్కరు లోనికి వస్తుంటారు. ఉద్యోగులు వచ్చే సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం తలుపులు తెరుచున్న సమయంలోనే ఇతరులు ఎవరైనా లోనికి ప్రవేశించారా? ప్రవేశిస్తే ఆ సమయంలో పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడున్నారు? అదే సమయంలోనే షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందా లేక అంతకు ముందే జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.   

హార్డ్‌ డిస్క్‌లు కాలిపోయాయి: అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ 
ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాదంపై మాకు ఉదయం 10.20 గంటలకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయి. సమీపంలోని మరో రెండు ఫైర్‌ టెండర్లు రప్పించాం. మొదటి అంతస్తులో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్‌ ప్రాపర్టీ ఉంది, హార్డ్‌ డిసు్కలు, కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. సెకండ్‌ ఫ్లోర్‌లోని కెమికల్‌ ల్యాబ్‌కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్లు అనుమానిస్తున్నాం. ఎమ్‌సీబీ వద్ద కేబుల్స్‌ సేకరించి పరీక్షిస్తున్నాం.  

ఓటుకు నోటు ఆధారాలు మాయం చేసేందుకే..: కేటీఆర్‌ 
ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓటుకు నోటు కేసులో వాయిస్‌ రికార్డింగ్‌లు తొలగించడంతోపాటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల కొరతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంతో ఏ కేసులో ఆధారాలు చెరిపేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు రేవంత్‌రెడ్డి అంటూ బీఆర్‌ఎస్‌ నాయకుడు క్రిశాంక్‌ పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు. 

కిషన్‌రెడ్డి అనుమానాలు 
ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కీలకమైన ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులకు సంబంధించి కీలక ఆధారాలు అగ్నికి ఆహుతయ్యాయా? లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement