హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందా? | HYDRAA Commissioner IPS AV Ranganath Exclusive Interview For Sakshi | Sakshi
Sakshi News home page

హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందా?

Feb 7 2026 4:58 PM | Updated on Feb 7 2026 9:36 PM

HYDRAA Commissioner IPS AV Ranganath Exclusive Interview For Sakshi

అమృతా ప్రణయ్‌లాంటి సంచలనాత్మక కేసును డీల్‌ చేసిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌.. ఆ తర్వాతి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైడ్రా అనే ఓ వ్యవస్థను కమిషనర్‌ హోదాలో ముందుకు నడిపిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా సరే.. హైడ్రా ‘రైట్‌ రూట్‌’లోనే ముందుకు వెళ్తోందని అంటున్నారాయన. అలాంటి వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా?.. సాక్షి డిజిటల్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. 

ప్రభుత్వం మారితే హైడ్రా పరిస్థితి?

రంగనాథ్‌: హైడ్రాకు ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. పది.. పదిహేనేళ్లు.. ఇలా నిరంతరాయంగా పని చేసినా సరిపోవు. ఉదాహరణకు.. మన చుట్టురా వేల చెరువులు ఉన్నాయి. వాటి పునరుద్దరణకు మొదటి అడుగు వేశాం. అదసలు అలా కొనసాగుతుంది. హైడ్రా అనేది రేవంత్‌ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువైంది. వాటర్‌ బాడీస్‌ ప్రొటెక్షన్‌ అనేది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి(ఆర్టికల్‌ 51-A(g) ప్రకారం). పొరుగున ఉన్న కర్ణాటకలో చూసుకుంటే చెరువుల సంరక్షణ 2008 నుంచే కొనసాగుతుంది. అక్కడ ఇన్నేళ్లలో ప్రభుత్వాలు మారాయి కదా. కాబట్టి.. ఆ అవకాశాలను కొట్టిపారేయలేం.

ప్రభుత్వాన్ని, బ్యూరోక్రట్లు వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయా? 
రంగనాథ్‌: నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం సామాన్యులను కాలుస్తోంది అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదు. పావుగా వాడుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఛాయిస్‌. అలాగే ఆ అధికారులపై విమర్శలు వచ్చినప్పుడు.. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదు. వాటికి హైడ్రా అనే వ్యవస్థ దూరం కూడా.

ఒత్తిళ్లతో పెద్దవాళ్లను టచ్‌ చేయట్లేదన్న విమర్శలపై ఏమంటారు?
రంగనాథ్‌: 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టాం. పేదవాళ్ల ఇళ్లనే కాదు.. ప్రముఖుల నిర్మాణాలనూ వదిలిపెట్టలేదు. ఎన్‌ కన్వెషన్‌ కూల్చివేత అందుకు ఉదాహరణ.   సినీ, రాజకీయ, వ్యాపార.. ఇతర రంగాల ప్రముఖుల కట్టడాలను కూల్చేశాం. కొన్నిసార్లు సామాజిక కోణంలో చూశాం. అందుకే ఎన్నో బస్తీలను వదిలేశాం. కొన్ని కేసుల్లో న్యాయం కూడా అందించాం. కొన్నింటికి ఎ‌ఫ్‌టీఎల్(ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌‌) ఇంకా డిసైడ్‌ కాలేదు. ఒక్కసారిగా ఫిక్స్‌ అయితే వాటిని వదిలిపెట్టం. సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని పట్టుకుని హైడ్రా పని తీరును శంకించాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోం కూడా. పనిలో 100 పర్సంట్‌ స్ట్రయిక్‌ రేట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం ఉంది కాబట్టే హైడ్రా ప్రజావాణికి జనం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి కదా.

ఒవైసీ కాలేజ్‌ను టచ్‌ చేయలేదన్న రాజకీయ విమర్శల నేపథ్యంలో తీసుకోబోయే యాక్షన్‌ ఎలా ఉందనుంది?
రంగనాథ్‌: ఒవైసీ కాలేజీలాగే చాలా భవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క ఆ కాలేజ్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి?. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఉండవచ్చు, పుల్లారెడ్డి లేదంటే వెంకట్ రెడ్డి కాలేజీ ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిష్కారం కనిపించదు. నిజంగా మనం ఒక్క లింక్‌పై మాత్రమే దృష్టి సారిస్తున్నాం. ఒక్క కేసును మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ హైడ్రా సైలెంట్‌గా ప్రభుత్వ భూముల్ని, చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొట్టి ఎంతో మేలు చేస్తున్నాం.

వేల, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాపాడుతున్నాం. హైడ్రా అనేది దేశంలోనే వినూత్నమైన ప్రభుత్వం. జాతీయ మీడియా సంస్థలే కాదు.. ఐఎస్‌బీ కూడా హైడ్రాను ప్రస్తావించింది. ముంబైలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కోరుకుంటున్నారు. అలాగే హైడ్రా పని తీరు కూడా మారింది. కూలగొట్టడమే కాదు.. చెరువుల పునర్మిరాణాలు చేపడుతోంది. కొందరు హైడ్రా పరిధి పెంచమని కోరుతున్నారు. దేవదాయ భూముల్ని ఎందుకు పరిరకక్షించకూడదని అనుకుంటున్నాం కూడా.  కానీ, పాలసీ, ఎఫ్‌టీఎల్‌ ఫైనల్‌ నోటిఫికేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టులు కూడా ఈ విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు మేం చేస్తున్నాం.

హైడ్రా కార్యాచరణలో లోపాల గురించి..
రంగనాథ్‌:చూసే వాళ్లను బట్టి ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాలు చికెన్‌, మటన్, చేపల వేస్టేజ్‌లు పడేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెళ్లి సమస్య పరిష్కరించాం. నష్టంగా భావించేవాళ్లు.. వేళ్లమీద లెక్కపెట్టుకునేవాళ్లు. వాళ్లు హైడ్రా ఉద్దేశాలను తప్పుబడతారు. కానీ, వందల, వేల, లక్షల మందికి మంచి  జరుగుతోంది. వాళ్లు మౌనంగా ఉంటారు.  జరిగే మంచి గురించి వాళ్లు మాట్లాడుకోరు. మాట్లాడే ఆ ఒకరిద్దరి గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా!. కాబట్టి ఉద్దేశం మంచిదే.. అలాగే కార్యాచరలోనూ సవ్యంగానే ఉంది.

మీ ఇల్లు కూడా ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో ఉందంట కదా?
రంగనాథ్‌: నేను ఉండేది మధురానగర్‌లో. నా ఇంటికి కిలోమీటర్‌ దూరంలో కృష్ణకాంత్‌ పార్క్‌ ఉంది. అది ఒకప్పుడు చెరువు. ఆ చెరువు దిగువన ప్రాంతంలో నేను ఉంటా. అది ఎఫ్‌టీఎల్‌ పరిధికి ఎంతో దూరం. ఎవరో సెన్స్‌ లేకుండా‌ కాంట్రవర్సిటీ కోసం క్రియేట్‌ చేసింది. హైడ్రా మీద వీలైనంత మంది అన్ని విధాల దాడులు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచారం కూడా.(నవ్వుతూ..)

రంగనాథ్‌ కూల్చివేతలకు వెళ్లడం అవసరమా?
రంగనాథ్‌: కచ్చితంగా అలా అనేం లేదు. ఆఫీస్‌ నుంచి కూడా పర్యవేక్షించొచ్చు. కానీ, ఒక్కోసారి హైడ్రా కమిషనర్‌గా అది నా బాధ్యత. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి.. విమర్శలు వస్తుంటాయి. ఆ బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది.  కొన్ని ఆపరేషన్‌లప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. బ్యూరోక్రట్‌గా, సివిల్‌ సర్వెంట్‌గా, పొలిటికల్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. తక్కువ మందికి డ్యామేజ్‌ కలిగేలా ఎక్కువ మందికి లాభం కలిగేలా చూడాల్సిందే. అప్పుడే కదా.. తర్వాతి తరాలు హైడ్రా గురించి మాట్లాడుకునేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement