బాధ్యులైన అధికారుల పాత్రపై ఆడిట్‌కి ఆదేశిస్తాం
ప్రాజెక్టు పనుల్లో ఆలస్యంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి అసంతృప్తి
కేంద్రం హెచ్చరికతో నీటిపారుదల శాఖ అధికారులకు సీఎస్ అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల్లో పురోగతిపై నిర్వహించే ‘ప్రగతి’సమీక్షలో భాగంగా కేంద్ర కేబినెట్ సెక్రెటరీ ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. వాస్తవ గడువు ముగిసి ఏళ్లు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే పలుదఫాలుగా తాము ప్రగతి సమీక్షలు నిర్వహించినా ఆశించిన పురోగతి మాత్రం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.8,200 కోట్ల అంచనాలతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టును వాస్తవానికి 2019 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, జాప్యం కారణంగా అంచనాలు రూ.14,730 కోట్లకు పెరిగాయి. ఇప్పటివరకు 87.7 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంచనాల పెంపుతో అదనపు ఆర్థిక భారంతో పాటు ఇప్పటికే 74 నెలల సమయం వృథా అయిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
జాప్యానికి, దాని వల్ల అంచనా వ్యయం పెరగడా నికి కారణమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడానికి కాగ్‌తో ఆడిట్ నిర్వహిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 611 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా, వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని కేబినెట్ కార్యదర్శి గడువు విధించినట్టు సమాచారం. హైకోర్టులో కేసుల నేపథ్యంలో పెండింగ్‌లో ఉండిపోయిన మరో 3,642 హెక్టార్ల భూమిని సైతం మార్చిలోగా సేకరించాలని కోరినట్టు తెలిసింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టు అధికారులకు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. ఇకపై ప్రాజెక్టు పురోగతిపై ప్రతివారం నివేదికలు పంపించాలని, భూసేకరణకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని సీఎస్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతినెలా ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తామని, పురోగతి లేకుంటే కఠిన చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించినట్టు సమాచారం.


