వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్‌ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!!
జానపద కళాకారిణి.. సర్పంచ్
ఇల్లంతకుంట: నాగులమ్మ.. నాగులమ్మ.. నల్ల నాగులమ్మ.. చిన్న దొర బంగ్లా మీద సీటీలెయ్యకురా.. తెల్లచీర కట్టుకొని టేకుళ్లకు కలువబోతే.. వంటి జానపదపాటలకు నృత్యంతో అలరించిన యూట్యూబ్ ఆర్టిస్ట్ గౌరవేణి శివాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటు మీద పల్లె గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. శివాని 300కు పైగా జానపద పాటలకు డాన్సర్‌గా అభినయించారు. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆమె సోదరుడు బాబు వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారు. తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్ సత్యం వద్ద మెలకువలు నేర్చుకున్నారు. ఆర్‌ఎన్‌ఎస్ పేరుతో డ్యాన్స్‌సూ్కల్ ఏర్పాటు చేశారు. జానపద గేయాల డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్ కొనసాగారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన శివానికి బోటు మీద పల్లెకు చెందిన గౌరవేణి సుమన్‌తో వివాహమైంది. దాచారం అనుబంధ గ్రామంగా ఉన్న బోటు మీద పల్లె నూతన గ్రామపంచాయతీగా ఏర్పడడంతో రిజర్వేషన్ కలిసొచ్చి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి పాటుపడడంతో పాటు, అవకాశం వచ్చినప్పుడు జానపద గేయాల్లో రాణిస్తానని శివాని పేర్కొన్నారు.
సైనికుడు.. సేవకుడు
ఫెర్టిలైజర్ సిటీ: మొన్నటి వరకు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహించి.. నేడు గ్రామ సర్పంచ్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ యర్రం హరినాథ్‌రెడ్డి 2003లో దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో చేరారు. 17ఏళ్లు సరిహద్దుల్లో విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ చేశారు. ఊరిపై ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో రామగుండం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలు రావడంతో పదవికి రాజీ నామా చేసి, గుంటూరుపల్లి సర్పంచ్‌గా పోటీ చేశారు. 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఏ చదివిన హరినాథ్‌రెడ్డి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు.



