సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. ఆధారాలు లేవని ఎనిమది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు.
కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను కడియం లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ క్రమంలో విచారణకు వివేకానంద హాజయ్యారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘న్యాయస్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది. ఫిబ్రవరి ఆరో తేదీ లోపు ఫిరాయింపు కేసులో తీర్పు ప్రకటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకే విచారణ వేగవంతం అయింది. కడియం శ్రీహరి కేసులో విచారణకు హాజరయ్యాను. కడియం తరపున హాజరైన అడ్వకేట్ మరింత సమయం కావాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తుంది. దానం నాగేందర్ కేసు విచారణకు పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు హాజరుకాలేదు?. సుప్రీంకోర్టును మరోసారి తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆధారాలు లేవని 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. గాంధీ భవన్‌కు ఎలా వస్తారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు.. ఇది స్పీకర్‌కు కనపడదా?. దానం కాంగ్రెస్ బీ ఫారంపై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేయరా?. స్పీకర్ న్యాయం చేయకపోయినా కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఉన్నాయి. ఫిబ్రవరి 19న మరోసారి కడియం కేసును విచారిస్తామని స్పీకర్ ప్రకటించారు’ అని తెలిపారు.


