తప్పు చేసి దొరికినప్పుడల్లా చంద్రబాబు ప్రయోగించే టెక్నిక్.. ఎదురుదాడి!. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చిన నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ గళమెత్తుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అర్థమైనా దాంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నటిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారమే చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, కేడర్‌ను ఆదేశించారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు.
మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనుకాడడం లేదు. కుప్పం టూర్‌లో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు శ్రీవెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశం అంతటా ప్రచారం చేసిందెవరు? ఇవి చాలవన్నట్లు టీడీపీని గట్టెక్కించడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా అబద్దపు కథనాలు రాస్తున్నాయి. ప్రతిష్ట పూర్తిగా పోయినా ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా లాజిక్కు లేని వ్యాఖ్యలతో దిక్కుమాలిన సంపాదకీయం ఒకటి రాసింది.
జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ, మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పింది ఈనాడు మీడియాకు తెలియదా?. జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని కదా ఆయన చెప్పారు?. అప్పుడు అదే చంఢాలాన్ని పేజీలకు, పేజీలు రాసి ప్రజలపై రుద్దాయి ఈ పత్రికలు. ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్లకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతుకొవ్వు, పామాయిల్‌కు తేడా తెలియదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి, పోటు తదితర సిబ్బంది, పూజారులు ఎవరూ పసికట్టలేకపోయారా?. అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్దాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా?. విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లినప్పుడు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయలేదే!. ఇవన్నీ పక్కనబెట్టి తగుదునమ్మా అటూ క్షమించరాని ఘోరాపచారమిది అంటూ రాసేసి ఈనాడు ఆత్మ వంచన చేసుకుంటే సరిపోతుందా?. తెల్లవారిలేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా?
మరో మాట చెప్పాలి. బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకుముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే ‘హర్ష్ ఫ్రెష్ డెయిరీ’ 2018 నుంచే టెండర్లలో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్లింది. ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ, 2019 ఫిబ్రవరిలో పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా!. ఆ తర్వాత 2019 ఆగస్టులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. ఈనాడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనూ లేదు.
అంటే పొరపాటున ఎవరో జర్నలిస్టు నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడం కోసం సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ‘భోలే బాబా కంపెనీ’గా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా? లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు?. దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా?. అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించాల్సి టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయి?. ఇదేనా వీరి భక్తి? హిందూ మతోద్ధరణ? కేసులో ఎలాగొలా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈపాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో!. ఎంత బురద వేసేవారమో కదా అన్నది వారి భావన కావచ్చు. ఇదే టైమ్‌లో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? దీనిని బట్టే వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం కొత్త కాదు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించివేసిన తర్వాత ఆయనపై ఎన్ని నిందలను మోపింది తెలిసిన విషయమే. గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానాలు, డాక్యుమెంటరీ తీయడం కోసం సాధారణ భక్తులందరినీ నిలిపివేయడంతో తొక్కిసలాట జరిగితే కుంభమేళాలో జరగడం లేదా? రోడ్డు ప్రమాదాలలో జరగడం లేదా? అని దబాయించారు. తుని వద్ద రైలు దగ్దం జరిగితే, అది తన ప్రభుత్వ వైఫల్యం అని అంగీకరించకుండా రాయలసీమ నుంచి గూండాలు వచ్చి దహనం చేశారని ఆరోపించారు. కానీ, గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలపై కేసు పెట్టారు. కందుకూరు, గుంటూరులలో ఆయన సభలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందితే అది పోలీసుల వైఫల్యం అని విమర్శలు చేశారు. అదే వైఎస్ జగన్ టూర్‌లో ఒకరు ప్రమాదానికి గురైతే మాత్రం అదంతా కారులో ప్రయాణిస్తున్న జగన్ తప్పని కేసు పెట్టించారు.
అలాగే ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారు. అది వారికే ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మోసం చేయడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అండ్ కో వెనుకాడటం లేదన్న విమర్శ వస్తోంది. పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే శాంతిభద్రతలపై ఎంత శ్రద్ద ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అదే పని వైఎస్సార్‌సీపీ వారు చేసి ఉంటే ఈ పాటికి పోలీసులు ఎన్ని కేసులు పెట్టేవారో!. అయితే, అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలామంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు. కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడడానికి ఇంకెంత కాలం పడుతుందో!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


