పిల్లి తెచ్చిన తంటా! | pet cat surgery dispute reaches police station | Sakshi
Sakshi News home page

పిల్లి తెచ్చిన తంటా!

Feb 4 2026 7:04 AM | Updated on Feb 4 2026 7:04 AM

pet cat surgery dispute reaches police station

మూడుసార్లు సర్జరీ చేసినా కుదుటపడని మార్జాలం ఆరోగ్యం 

ప్రశ్నించిన యజమానురాలిని  దూషించిన వైద్యుడు.. కేసు నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: పిల్లి తెచ్చిన తంటా పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లింది. వివరాలు... వనస్థలిపురానికి చెందిన పెండ్యాల శాంభవిదేవి మూడేళ్లుగా మగ పెర్షియన్‌ పిల్లిని పెంచుకుంటోంది. అనారోగ్యం కారణంగా గతేడాది ఆగస్టు 27న అల్కాపురిలోని స్నిఫర్స్‌ పెట్‌ క్లినిక్‌కు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్‌ క్రాంతికుమార్‌ పిల్లిని పరీక్షించి, మూత్ర సంబంధిత సమస్య ఉందని చెప్పారు. ఆమె అంగీకరించడంతో అదేరోజు శస్త్రచికిత్స చేశారు. 

అయితే సర్జరీ సమయంలో పిల్లి కదలడంతో దాని శరీరంలో వేసిన పైపు పక్కకు జరిగిందని చెప్పి మళ్లీ శస్త్రచికిత్స చేశారు. అనంతరం చికిత్స ఖర్చులను శాంభవి చెల్లించి పిల్లిని తీసుకొని ఇంటికెళ్లింది. అయినా పిల్లి ఆరోగ్యం కుదుటపడకపోగా విషమంగా మారింది. డిసెంబర్‌లో మళ్లీ క్లినిక్‌కు తీసుకెళ్లగా డాక్టర్‌ క్రాంతి పిల్లికి మరో సర్జరీ చేశారు. మూడు శస్త్రచికిత్సల తర్వాత కూడా దాని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శాంభవి కుంగిపోయింది. 

ఈ విషయమై క్లినిక్‌కు వెళ్లి ప్రశి్నంచగా డాక్టర్‌ క్రాంతి ఆమెను అసభ్యపదజాలంతో దుర్భాషలాడారు. ఇంకోసారి క్లినిక్‌కు వస్తే చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేశారు. గత నెల 31న డాక్టర్‌ క్రాంతి కుమార్‌కు ఆమె ఫోన్‌ చేయగా, ఇకపై దానికి చికిత్స చేయనని, ఇంకోసారి ఫోన్‌ చేయొద్దని దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో మంగళవారం బాధితురాలు చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement