పొర్లుదండాలు పెట్టినా సీఎంను క్షమించరు | Congress govt betrayed unemployed youth says KTR | Sakshi
Sakshi News home page

పొర్లుదండాలు పెట్టినా సీఎంను క్షమించరు

Feb 4 2026 6:02 AM | Updated on Feb 4 2026 6:02 AM

Congress govt betrayed unemployed youth says KTR

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ?.. రేవంత్‌ ముఖం చాటేయడం నిస్సిగ్గు చర్య

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన మరో గ్యారంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన సీఎంను చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్‌.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్‌తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని కేటీఆర్‌ విమర్శించారు. తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నారు.

కేసీఆర్‌ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు ని యామక పత్రాలు ఇచ్చి ఫొటోలకు పోజులు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులె త్తేయడంతోనే తెలంగాణలో ‘రిక్రూట్‌మెంట్‌ జీరో’గా మారిపోయిందని కాంగ్రెస్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎండగట్టారు. ఈ మేరకు కేటీఆర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్‌ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని, పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.

తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కున వేలేసుకుని క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు, విద్యార్థులకు చేస్తున్న ఈ ద్రోహంపై వెంటాడుతామన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారన్నారు. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారన్నారు. మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్‌ నుంచి అశోక్‌ నగర్‌ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. 

రెండేళ్లలోనే కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకత: కేటీఆర్‌
∙పురపోరులో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టండి
∙బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉంది
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు బీఆర్‌ఎస్‌ భారీ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మున్సిపల్‌ కోఆర్డినేటరు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. 

కాంగ్రెస్‌ మోసాలను జనం గమనిస్తున్నారు
‘కాంగ్రెస్‌ మోసాలను ప్రజలు గమనిస్తుండటంతో మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉంది. రాబోయే వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకం. చాలా చోట్ల పార్టీ విజ్ఞప్తిని మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబెల్‌ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించి ప్రచారంలో భాగస్వాములను చేయాలి. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారికి తగిన గౌరవం ఇవ్వాలి. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి’అని కేటీఆర్‌ సూచించారు. 

గెలుపు గుర్రాల కోసం కార్యాచరణ
‘ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచారంపై దృష్టి సారించి ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేయాలి. గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలి. అభ్యర్థుల గెలుపునకు ప్రాధాన్యత ఇస్తూ పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతం పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉండాలి’అని కేటీఆర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement