బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..! | Health Tips: Best Brain Boosting Foods What to Eat for Better Memory | Sakshi
Sakshi News home page

Best Brain Boosting Foods: బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!

Dec 23 2025 5:59 PM | Updated on Dec 23 2025 6:36 PM

Health Tips: Best Brain Boosting Foods What to Eat for Better Memory

మెదడు ఎంతటి కీలకమైనదంటే... మన శరీరం బరువులో దాని బరువు కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం దేహానికి అందే ఆక్సిజన్‌లో 20 శాతం దానికే  కావాలి. దేహం మొత్తం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే చెందాలి. ఇక అదెంతటి అద్భుతమో చూద్దాం... దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. అన్నీ కొవ్వు కణాలే. అంటే మెదడు కణాలన్నీ కొవ్వుతో నిర్మితమైనవే. కొవ్వు లేకపోతే మెదడే లేదు. అంటే...  శరీరంలోని 25 శాతం కొలెస్ట్రాల్‌ మెదడులోనే ఉంటుంది. మన ఆలోచనలకూ, పనులకూ, తెలివితేటలకూ అదే మూలం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అది మందకొడిగానూ, మరికొన్ని ఆహారాలతో అది చురుగ్గానూ ఉంటుంది.  అది చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి ఆహారం కావాలో తెలిపే కథనం.

మెదడుకు హాని చేసే ఆహారాలు

  • నిల్వ ఉంచిన ఉప్పు కలిపిన పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్‌ సూప్స్‌తోపాటు ప్రిజర్వేటివ్స్‌ కలిపిన ఆహార పదార్థాలు మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. 

  • మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యానికే కాదు... మెదడుకూ చేటు చేస్తుంది. 

  • కొవ్వుల్లో డాల్డా వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్, అలాగే మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం (Non Veg) తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్‌ వంటి కొవ్వులనూ చాలా పరిమితంగానే (అరుదుగా కేవలం రుచి కోసమే) వాడాలి. 

  • ఆల్కహాల్‌ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్తబ్ధుగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. అలాగే మెదడును ఉత్తేజపరచడానికి తాగే సిగరెట్‌ లాంటి పొగతాగే అలవాటు కూడా దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందకొడిగా మారుస్తుంది. 

  • మెదడుకు అందే ఆక్సిజన్‌ మోతాదులనూ తగ్గిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పనిచేయాలనీ, మెదడుకు సంబంధించిన అల్జైమర్స్‌ వంటి జబ్బులు నివారించడానికి మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఈలోకంలోని జీవులన్నింటిలోకెల్లా అత్యంత తెలివైన మెదడు మానవులని పిలుచుకునే మన హోమో సేపియన్‌ జీవులదే. ఈ మొత్తం కాస్మోస్‌లో ఇంకా తెలివిగల జీవం ఇంకెక్కడుందో ఇప్పటికీ తెలియదు కాబట్టి... ప్రస్తుతానికి ఈ సమస్త విశ్వంలో ఇంతటి సంక్లిష్టమైన మెదడు, అత్యంత అద్భుతమైన మెదడు మానవులది మాత్రమే. 

అందులో ఎన్ని కణాలు ఉన్నాయనేదానికి నిర్దిష్టమైన లెక్క లేదు. కానీ దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్‌ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్‌’ అంటారు. కేవలం ఇసుక రేణువంత భాగంలో కనీసం లక్ష న్యూరాన్లు, పొరుగు కణాలతో అనుసంధానితమైన ఉన్న కనెక్షన్లు 100 కోట్ల వరకు ఉన్నందువల్లనే బహుశా ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక భావన.

ఎదుగుదలలోనే అద్భుతాలు..
తల్లికడుపులో బిడ్డ ఉండగానే మెదడు ప్రతి నిమిషానికీ 2,50,000 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా ఆ బిడ్డ.. ఈ లోకాన్ని చూసే నాటికి అతడు 1000 కోట్ల కణాలతో పుడతాడు. పన్నెండు నెలల వయసప్పుడు తీసిన మెదడు స్కాన్, దాదాపు యుక్తవయసులో ఉన్నప్పటి మెదడు స్కాన్‌ దాదాపు ఒకేలా ఉంటాయి. కాక΄ోతే ట్రిలియన్ల కొద్దీ సైనాప్స్‌లు ఏర్పడుతూ ఉంటాయి. పదేళ్ల వయసు నుంచి చాలా వేగంగా సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల జరుగుతుంది. 

మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరగడం, దృష్టి పెట్టని అంశాలు తగ్గడం జరుగుతాయి. ‘దీన్నే యూజ్‌ ఇట్‌... ఆర్‌ లూజ్‌ ఇట్‌’గా పేర్కొంటారు. మనకు ఆనందం ఇచ్చే అంశాలనూ ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకుంటాం. దాదాపు 18 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన వికాసం దాదాపుగా పూర్తవుతుంది. ఈ వికాస క్రమంలోనూ, అటు తర్వాత మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఆహారాలు దోహదపడుతుంటాయి. మెదడు చురుగ్గా ఉండటానికి, చాలాకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పిండదశలో... 
పిండ దశ నుంచీ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే కీలకమైన పోషకమే ‘ఫోలిక్‌ యాసిడ్‌’. అందుకే ఓ మహిళ గర్భం దాల్చగానే లేదా దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటూ ఉన్నప్పుడు గర్భం దాల్చకముందు నుంచే మహిళలకు ‘ఫోలిక్‌ యాసిడ్‌’ పోషకాన్ని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. 

ఈ ఫోలిక్‌ యాసిడ్‌ పోషకం మహిళ గర్భవతిగా ఉన్నప్పట్నుంచే మెదడు తాలూకు మంచి ఎదుగుదలకూ, పిండంలో న్యూరల్‌ ట్యూబ్‌కు సంబంధించిన సమస్యల నివారణకూ తోడ్పడుతుంటుంది. ఫోలిక్‌ యాసిడ్‌ అనే ఈ పోషకం అన్ని రకాల ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది. ఫోలియేజ్‌ అంటే ఆకులు. అందుకే పాలకూర వంటి అన్ని ఆకుకూరల్లో సమృద్ధిగా లభ్యమవుతుంది కాబట్టే దీనికి ‘ఫోలిక్‌ యాసిడ్‌’ అని పేరు.

బిడ్డ పుట్టాక...
ఇక బిడ్డ పుట్టి నేల మీద పడ్డాక... ఆ చిన్నారి మెదడు ఆరోగ్యంగా ఎదగాడానికి అవసరమైనది ‘డొకోజా హెగ్జాయినోయిక్‌ యాసిడ్‌’ (సంక్షిప్తంగా ‘డీహెచ్‌ఏ’) అనే మరో రకం పోషకం అవసరం. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒక రకం. ఈ పోషకం తల్లిసాలలో సమృద్ధిగా లభిస్తుంది. 

బిడ్డలు పెరిగి పెద్దయ్యా వారికి ఇదే పోషకం కావాలంటే చేపల్లో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక బిడ్డల పెరుగుదల తర్వాత, వారు యుక్తవయస్కులుగా మారాక... అటు పిమ్మట కూడా ఆ మెదడు ఆరోగ్యం సక్రమంగా నిర్వహితం కావాలంటే అవసరమైన పోషకాలు ఇవి...

సంక్లిష్టమైన పిండిపదార్థాలు(కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌)...
మెదడు చురుగ్గానూ, అలాగే సక్రమంగానూ పనిచేస్తూ... అది చేసే పనిలో సునిశితత్వం, వేగం, చురుకుదనం ఉండాలంటే ముందుగా మొత్తం శరీరానికి శరీరం తీసుకునే శక్తిలో 15 శాతం దానికే కావాలి. అంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌లో 15 శాతానికి తగ్గకుండా మెదడుకు సమృద్ధిగా అందుతూ ఉండాలి. అందుకోసం... ఆ శక్తిని సమకూర్చేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌. 

మనకివి పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు మొదలుకొని పొట్టు తీయని అనేక ముడిధాన్యాల నుంచి ఈ కాంప్లెక్స్‌ కార్బోహేడ్రేట్లు అందుతాయి. శక్తి కోసం మనం తీసుకోదగ్గ వాటిలో ఇవి ప్రధానమైనవి. 

పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి దొరికే గ్లూకోజ్‌ దేహంలోకి చేరగానే తక్షణం వినియోగితమై΄ోతుంది. ఆ తర్వాత వెంటనే మళ్లీ గ్లూకోజ్‌ (Glucose) అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్‌ ఒక క్రమమైన పద్ధతిలో చాలాసేపు పాటు మెదడుకు అందుతూ ఉంటుంది.

అత్యవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ )...
మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన కొవ్వు పదార్థాలు ఇవి. అందుకే మెదడుకు అవసరమైన ఈ కొవ్వులను ‘ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌’ (ఈఎఫ్‌ఏ) అంటారు. ఇవే ప్రధాన ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్‌ అయిన అల్ఫా లినోలినిక్‌ యాసిడ్‌ (ఏఎల్‌ఏ), ఇకోజా పెంటాయినిక్‌ యాసిడ్‌ (ఈపీఏ), డొకాజో హెగ్జాయినిక్‌ యాసిడ్‌ (డీహెచ్‌ఏ) వంటివి. 

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మెదడు కణాలన్నీ కేవలం కొవ్వు కణాలే. ఒకరకంగా చూస్తే... మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను దేహం తనంతట తాను తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని ఆహారం నుంచి తీసుకోవాలి. ఆ ఎనెన్షియల్‌ కొవ్వుల సాయంతోనే మెదడుకు అవసరమైన కీలక కొవ్వు కణాల మెయింటెనెన్స్‌ జరుగుతూ ఉంటుంది.

ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ అంటే... 
మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్‌ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, ముఖ్యంగా సాల్మన్, మెకరెల్స్, సార్డిన్‌ వంటి చేపల నుంచి... ఇంకా గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.

మెదడుకు మేలు చేయని కొవ్వులు...
మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని రకాల కొవ్వులూ మెదడుకు మంచి చేయవు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా మారుస్తాయి. అవి ఏవంటే... ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అని పిలిచే హైడ్రోజనేటెడ్‌ కొవ్వులు. ఇవి మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ను అడ్డుకుంటాయి. 

తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... ఈ హైడ్రోజనేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేక్‌లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అవి మెదడును కాస్త మందకొడిగా చేయడంతోపాటు ఆరోగ్యానికీ అంతగా మేలు చేయవు. అందుకే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్‌ను నిషేధించారు.

తినుబండారాలు కొంటున్నారా... తస్మాత్‌ జాగ్రత్త...
మనం మార్కెట్‌లో కొనే తినుబండారాల ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితాను తప్పక పరిశీలించాలి. ఒకవేళ అందులో హైడ్రేజనేటెడ్‌ ఫ్యాట్స్‌/ఆయిల్స్‌ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. అదికూడా అరుదుగానే ఎప్పుడైనా తీసుకోవడం మంచిది. మెదడుకు అవసరమైన కొవ్వులు (అసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) కోసం చేపలు (Fishes) ఎక్కువగా తినడం అన్ని విధాలా మెదడుకు మేలు చేస్తుంది. ఎందుకంటే చేపల్లో మెదడును చురుగ్గా ఉంచడానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

అమైనో యాసిడ్స్‌...
మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే అంశాలను న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ సహాయంతో సమాచారం తాలూకు ట్రాన్స్‌మిషన్‌ ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు సహాయపడేవే ‘అమైనో ఆసిడ్స్‌’. ఇవి మనకు ప్రోటీన్స్‌ నుంచి లభ్యమవుతాయి.

మన మూడ్స్‌ కూడా న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌పైనే...
మనకు కలిగే రకరకాల మూడ్స్‌ కూడా ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు హాయిగా, గాఢమైన నిద్ర పట్టాలంటే సెరటోనిన్‌ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ అవసరం. ఈ ట్రిప్టొఫాన్‌లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు.

విటమిన్లు / మినరల్స్‌ (ఖనిజలవణాలు)... 
మెదడు పనితీరు బాగా చురుగ్గా కొనసాగడానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు చాలా ప్రధానమైనవి. ఇవి అమైనో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్‌మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌లో మార్చడంలోనూ తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి విటమిన్‌ బీ–కాంప్లెక్స్‌లోని బి–1, బి–6, బి–12 ప్రధానంగా అవసరమైవుతాయి. 

మళ్లీ వీటిన్నింటోనూ విటమిన్‌ బి–12 ఇంకా కీలకం. ఈ విటమిన్లు తాజా కూరగాయల్లో, ముదురాకుపచ్చటి ఆకుకూరల్లో, పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి–12 మాంసాహారంలోనే ఎక్కువ. అందుకే... ఇటీవల చాలామంది స్ట్రిక్ట్‌ వెజిటేరియన్స్‌ (వీగన్స్‌)లోనూ, ఎండ అంతగా సోకనివారిలో (ఎండకు ఎక్కువగా ఎక్స్‌΄ోజ్‌ కానివారిలో) విటమిన్‌ ‘డి’.. ఈ రెండు రకాల విటమిన్ల లోపం కారణంగా వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. 

ఈ పరిస్థితి కారణంగా ఒక్కోసారి వారు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా జరగడాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్‌’ / ‘సింకోపీ’ అంటారు ఇటీవల ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇప్పుడీ కండిషన్‌ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటివారంతా డాక్టర్ల సూచన మేరకు విటమిన్‌–డి సప్లిమెంట్లతోపాటు దేహంలో విటమిన్‌ బి–12 మోతాదులను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్‌–ఈ కూడా మనలో విద్యలూ–నైపుణ్యాలు నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది.

నీళ్లు...
మెదడులోని ఘనపదార్థంలో చాలావరకు కొవ్వులే కాగా... ఇక మొత్తం మెదడులో 80 శాతం వరకు నీళ్లే ఉంటాయి. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మనం మన మూత్రం రూపంలోనూ, అలాగే మనం ఊపిరి వదులుతున్నప్పుడు (ఉచ్ఛాస్వనిశ్వాసల్లో) రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. 

ఇలా బయటకు పోయే నీటిని ఎప్పటికప్పుడు మళ్లీ భర్తీ చేసుకోవడం అవసరం. దీనికోసం అదేమొత్తంలో మళ్లీ నీటినీ తీసుకోవాలి. అనేక కారణాల వల్ల కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగరు. ఎంతటి తక్కువ మోతాదులో నీళ్లు తాగేవారైనా రోజులో కనీసం 1.5 లీటర్లను తప్పక తీసుకోవాలి. (మిగతా నీళ్ల మోతాదు కాస్తా మనం రోజూ తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంటుంది. 

ఎవరిలోనైనా వారు రోజులో తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది వాళ్ల వాళ్ల మూడ్స్‌పై కూడా ప్రభావం చూపేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రతిఒక్కరూ రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకుంంటూ ఉండటం మంచిది. అప్పుడు... నీటితో పాటు తీసుకునే ఆ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. 

ఇక ద్రవాహారాల్లో టీ, కాఫీల వంటివి డీహైడ్రేషన్‌ను వేగవంతం చేస్తాయి. అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే టీ, కాఫీలూ, కెఫిన్‌ ఉండే పానీయాలను చాలా పరిమితంగా (అంటే రోజుకు రెండు కప్పులకు మించకుండా) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే ఆ పానీయాలు తొలుత మెదడును చురుగ్గా చేసినప్పటికీ... ఇలా వేగంగా పనిచేయించడం వల్ల మెదడు అంతే వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌వల్ల కూడా ఇదే హాని జరుగుతుంది. 

మెదడుకి మేలు చేసే ఆహారాలు...
మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.  

ఆకుకూరలతోపాటు కూరగాయల్లో...
పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్‌రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ–ఆక్సిడెంట్స్‌ మెదడు కణాలను చాలాకాలం ΄ాటు ఆరోగ్యంగా ఉంచడంతో ΄ాటు అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో ΄ాటు చాకొలెట్, గ్రీన్‌ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.

చేపలు...
పండుగప్ప / పండు చేప, వంజరం, కనగర్తలు (మాకరెల్‌), సాల్మన్, హెర్రింగ్‌ వంటి చేపల్లో మెదడు చురుకుదనానికి సహాయపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ.

నూనెల్లో...
మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్‌ ఆయిల్‌ చాలా మంచిది. ఇది రక్త΄ోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్‌), అలై్జమర్స్‌ వ్యాధులను ఆలివ్‌ ఆయిల్‌ కొంతమేరకు నివారిస్తుందని చెప్పవచ్చు.

పండ్లు...
మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మేలు చేస్తాయి. 
- డాక్టర్‌ హరిత శ్యామ్‌ .బి, సీనియర్‌ డైటీషియన్‌ 

చదవండి: భాయిజాన్‌ సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement