పాత్రికేయులూ...  మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్‌!  | Promenade a Dio: Master the scorpion position dance | Sakshi
Sakshi News home page

పాత్రికేయులూ...  మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్‌! 

Feb 7 2026 5:59 AM | Updated on Feb 7 2026 5:59 AM

Promenade a Dio: Master the scorpion position dance

హ్యూమరమరాలు

గౌరవనీయులైన పాత్రికేయులకు సమస్త మగపురుగులూ నమస్కరించి వ్రాయునది ఏమనగా!  

అయ్యా... 
మా జంతు ప్రపంచంలో మగపురుగులైన మేము మా సాటి ఆడజీవులకు ఎంతో గౌరవమిస్తూ ఉంటాం. అదెలాగో చెబుతాం వినండి. 
ఒకవేళ... మాలో తేళ్ల జాతి గనక ‘షోలే’ సినిమా తీశాయనుకోండి. అప్పుడు మా జాతిలోని ఆడ బసంతీయే... మగతేలును పట్టుకుని గావుకేక పెడుతుంది. ఏమనీ... ‘‘వీరూ... ఏ బిచ్ఛువోకే సామ్‌నే మత్‌ నాచ్‌ నా’’ అంటూ అరిచి గీపెడుతుంది. 

ఎందుకంటే... మా తేళ్లజాతిలో లేడీతేలును పడేయాలంటే తేలు మగపురుగులైన మేము మా జాతి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించి చూపాలి. మీలో సాల్సా,  హిప్‌హాపుల్లా మా తేలుజాతి శాస్త్రీయనృత్యం పేరేమిటో తెల్సా? దాని పేరు  ‘ ప్రొమెనాడ్‌ ఎ డియో’’  (Promenade à  deux). మా పెళ్లి తర్వాత మా ట్రెడిషనల్‌ డాన్స్‌ చూపాకే మాకు శోభనం జరుగుతుంది. మా తేళ్ల జాతిలో తరతరాలుగా యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్న పవిత్రమైన ఆచారమిది. 

శోభనపు గదిలో ఓ తేలుజంట ఎంటర్‌ కాగానే... మా ఆడలేడీస్‌ మమ్మల్ని చూస్తూ... మీ మానవులు ‘పాడు గజాలా పాడు’ అన్నట్టుగానే, ‘‘ఆడరా... తేలుగా ఆడు’’ అని  ఆదేశిస్తాయి. అప్పుడు మేమూ... ‘తకిట తధిమి తకిట తధిమి తందానా... హృదయ లయల జతుల గతుల థిల్లానా’ అంటూ డాన్స్‌ చేయాల్సిందే. 

‘తడబడు అడుగుల తప్పని తాళానా...’’అంటూ పొరబాటున మా అడుగులు  తడబడ్డాయనుకోండి. సదరు ఆడతేలు ‘ఏయ్‌... చంద్రమోహన్‌. నువ్వు ఆడుతున్న ఆ   డాన్సేమిటీ... పడుతున్న ఆ అడుగులేమిటీ?’ అంటూ అరవదు సరికదా... మా డాన్స్‌ సరిగా కుదరనందుకు పనిష్మెంట్‌గా గబుక్కున మమ్మల్ని పట్టేసి గుటుక్కుమంటూ మింగేస్తుంది. 

అన్నట్టు మా తేలు చిన్నారులకు నర్సరీలలో చెప్పే రైమ్‌ ఏమిటో తెల్సా?
చిట్టి తేలమ్మా... అమ్మ చెప్పిందా
పెళ్లికెళ్లావా... మొగుణ్ణి చూశావా
డాన్సులాడావా... గుటుక్కున మింగావా!
∙∙ 
ఇక ‘జంపింగ్‌ స్పైడర్‌’ అని పిలిచే మా సాలీడుజాతి మగపురుగుల గురించి సాలిడ్‌గా  చెప్పాల్సిందెంతో ఉంది. మా జాతిలో డాన్స్‌ ఒకటే సరిపోదు. కాళ్లూ చేతులూ వేగంగా కదిలిస్తూ పుట్టే వైబ్రేషన్స్‌తో పాట కూడా పాడాలి.  ఆ పాటకు మేమే బాణీ కట్టుకోవాలి. మా బాణీలు ఎంత బాగుంటాయో తెల్సా. పొరబాటున మీరుగానీ విన్నారంటే...‘ఏంట్రా బాబూ ఈ జంపింగు స్పైడర్ల బాణీల్లో ఇంత మ్యూజిక్‌ ఉందీ!’ అంటూ ఆశ్చర్యపోతారు. ఇలా మా పాటకు మేమే ‘కొరియోగ్రఫీ’ చేసుకుని, మా లేడీస్‌ ముందు జంపింగ్‌ చేస్తూ మరీ డాన్స్‌ ఆడాలి. 

ఇక మా జంపింగు స్పైడర్లలో ఒకజాతి తాలూకు డాన్స్‌ ఎంతబాగుంటుందో తెల్సా?  అందుకే... మీ మనుషుల్లాగే మేము మావాటిని ‘పీకాక్‌ స్పైడర్స్‌’ అని పిలుస్తాం. ఎంతైనా... అవి మా జాతి నాట్యమయూరాలు కదా మరి! 
ఇదంతా చేసి మా లేడీస్‌ను ఇంప్రెస్‌ చేస్తేనే మా పెళ్లి... లేదంటే ఆ పూటకు దాని బ్రేక్‌ఫాస్టూ, లంచూ, డిన్నరూ, చిరుతిండీ, అంచూ, అప్పడం... అన్నీ  మేమే!  
ఇక మాలోనే ఇంకో జాతి ఉంది. పెళ్లి తర్వాత అది మొగుణ్ణి తప్పక తినేస్తుంది కాబట్టే దాని పేరు బ్లాక్‌ ‘‘విడో’’ అట!  
∙∙ 
ఇంకా చెప్పాలంటే... పురుగుల్లోనే ఒక రకమైన ‘ప్రేయింగ్‌ మేంటిస్‌’ జాతి ఖర్మ ఎలా తగలడిందంటే... శోభనం జరుగుతుండగానే అలా లిప్‌కిస్‌తో మొదలుపెట్టి... మా పెళ్లాలు మమ్మల్ని ఇలా తినేయడం మొదలుపెడతారు. మరి మగాళ్లమైన మేము శుభకార్యం మధ్యలోనే చనిపోతే ఎలా? అందుకే... మా ఆడ మేంటిసులు మమ్మల్ని  తినేసినా అసలు పని ఆగకుండా ఉండటం కోసం ఓ స్పేర్‌ మెదడును (గ్యాంగ్లియాన్లను) కడుపులో ఉంచుకుంటాం. 

ఇలా మా తర్వాతి తరాలు బలంగా ఉండటం కోసం... పొదగాల్సిన లేదా పిల్లలు పెట్టాల్సిన మా ఆడలేడీస్‌కి శక్తి సమకూర్చడం కోసం మా దేహాన్నే త్యాగం చేసేస్తాం. 
మా ఆడవారి అంగీకారమైతే తప్ప... వాళ్లను బలవంతం చేయడమో, మా ప్రేమను  ఒప్పుకోమంటూ ఇబ్బంది పెట్టడమో, కుదరకపోతే యాసిడ్‌ విసరడమో చేయం గాక చేయం.
కాబట్టి... మా మృగప్రపంచపు మగపురుగుల క్యారెక్టరును దృష్టిలో పెట్టుకుని... మా  మనోభావాలు గాయపడేలా... ‘మృగాళ్లూ’, ‘మగపురుగులూ’ అంటూ మీ మానవ మగాళ్లతో పోల్చి... మమ్మల్ని కించపరచవద్దని మనవి. 

– యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement