
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు.
ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.
ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.
ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.
కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.
ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.
కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది.
శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్‌లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్‌లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.
ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా.
కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు.
డా. కె.రామచంద్రారెడ్డి
(చదవండి: స్లీప్..స్క్రీన్..స్టడీ..!)