
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్‌మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్‌కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం.
1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవం
నిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్‌తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.
మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.
నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్‌ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.
2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్
ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్‌లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
స్క్రీన్‌లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది.
రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్‌కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది.
3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడం
నిద్రను, స్క్రీన్ టైమ్‌ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్‌లో చాలా కీలకమైన విషయం.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది.
పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి.
25 నిమిషాలు ఫోకస్‌తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.
నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను తగ్గిస్తుంది.
మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది.
యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్‌ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.
రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.
చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్‌ఫుల్ బ్రేక్‌లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.
జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.
రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్‌లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి.
(చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!)