
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్‌లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్‌ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్‌స్టిక్‌లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్‌ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్‌లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్‌కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట.
నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్‌ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం.