ఐదు దేశాల సరికొత్త పవర్ గ్రూప్
భారత్, అమెరికా, రష్యా, చైనా, జపాన్
జీ7 గ్రూప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి
పొలిటికో సంచలనాత్మక కథనం
పశ్చిమాసియానే తొలి అసైన్ మెంట్?
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం.
అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్‌నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది.
యూరప్ దేశాలకు చెక్?
జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.
ట్రంప్ సంకేతాలు
సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు.
సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.
అప్పుడే ఎజెండా రెడీ?
అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


