హైదరాబాద్‌కు మెస్సీ ‘కిక్‌’ | Argentina superstar Messi is coming to India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మెస్సీ ‘కిక్‌’

Dec 13 2025 3:11 AM | Updated on Dec 13 2025 3:11 AM

Argentina superstar Messi is coming to India

‘గోట్‌’ టూర్‌ షురూ నేడు

ముందుగా కోల్‌కతాలో 

సాయంత్రం హైదరాబాద్‌కు

ఓ మారడోనా... ఓ పీలే... ఓ డుంగా... ఓ రొనాల్డిన్హో... వీళ్ల సరసన నిలిచేందుకు తాజాగా అర్జెంటీనా సూపర్‌స్టార్‌ మెస్సీ ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (జీఓఏటీ) టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో ఓ పండుగలా దిగి వస్తున్నాడు. అభిమానుల్ని ‘కిక్‌’ ఎక్కించనున్నాడు. అతి కొద్దిమంది ఎంపిక చేసిన వారితో కలిసి విందు కూడా చేయబోతున్నాడు. ఫొటోలు దిగబోతున్నాడు. 

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఇంత తీరిగ్గా భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. గతంలో 14 ఏళ్ల క్రితం వచ్చాడు. కానీ వచ్చిన పని మాత్రమే చూసుకొని (అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడి) వెళ్లాడు. కానీ ఇప్పుడలా కాదు... పని గట్టుకొని మరీ తన భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకే వస్తున్నాడు.  

సాక్షి, హైదరాబాద్‌: మెస్సీ... మెస్సీ... మెస్సీ... కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే, స్టాక్‌ మార్కెట్‌ సూచీల కంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. అందరి నోటా ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్‌ బందోబస్తు (4 నగరాలకు సంబంధించి) ఏర్పాట్లు కూడా అతని కోసమే! 

అయితే ఎవరీ మెస్సీ! ఎందుకంత క్రేజ్‌? క్రికెట్‌ మతమైన భారత్‌లో ఓ ఫుట్‌బాల్‌ స్టార్‌ను ఇంతలా తలకెక్కించుకుంటారా! అంటే... అవును మరి... అతను ఆడే ఆట ఫుట్‌బాల్‌కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు. కానీ అతను ఆడే మ్యాచ్‌లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంతో సంబంధం లేకుండా అభిమాన హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమూ ఉన్నాం. అందుకే ఆ క్రేజ్‌!

గతంలో వచ్చి ఏం చేశాడు 
జగద్విఖ్యాత ఫుట్‌బాలర్‌ మెస్సీ 2011లోనూ భారత్‌కు వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్‌ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్‌ క్రేజీ భారత్‌లో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు లయోనల్‌ వచ్చాడు. కోల్‌కతాలో సాల్ట్‌లేక్‌ మైదానంలో వెనుజులాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది. 

ఈ అంతర్జాతీయ ‘ఫిఫా’ మ్యాచ్‌ ముగిసిన వెంటనే మరే కార్యక్రమం పెట్టుకోకుండానే అక్కడి (కోల్‌కతా) నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. అప్పటికి, ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు జట్టులో ఒకడు. ఇప్పుడు అతడొక్కడే ఆకాశమంత ఆనందం!

డే–1 ఫస్ట్‌ హాఫ్‌ కోల్‌కతా 
మెస్సీ ఈవెంట్‌కు పెట్టిన పేరు ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’. నాలుగు నగరాల్లో ముందుగా అడుగు పెట్టేది కోల్‌కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్‌ కట్‌ లాంటివి కాకుండా... వర్చువల్‌గా బస చేసిన హోటల్‌ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. 

తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్‌’ సత్కారానికి వెళ్తాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనూ కాసేపు ముచ్చటిస్తాడుఎవరిని కలుస్తాడు: ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుఖ్‌ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్సౌరభ్‌ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్‌లేక్‌ మైదానాన్ని మోతేక్కిస్తాడు.

డే–1 సెకండ్‌ హాఫ్‌ హైదరాబాద్‌ 
మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజిబిజీగా షెడ్యూల్‌ ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్‌ కప్‌’ ఫుట్‌బాల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడతాడు. 

ఎవరిని కలుస్తాడు: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, సీనియర్‌ రాజకీయ నాయకులు హాజరవుతారు.  

డే–2 ముంబై 
పర్యటనలో రెండో రోజంతా వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీబిజీగా గడుపుతాడు. వాంఖెడేలో చారిటీ మ్యాచ్‌ ఆడతాడు. ఇందులో క్రికెట్‌ స్టార్స్‌ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్‌ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్‌ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్‌–2022 ప్రపంచకప్‌ సాకర్‌కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్‌లో వేసుకున్న జెర్సీలు, కిట్‌లను వేలం వేయనున్నారు.  

ఎవరిని కలుస్తాడు: సచిన్‌ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌లతో చారిటీ మ్యాచ్, బాలీవుడ్‌ స్టార్స్‌ జాన్‌ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్‌ తదితరులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తాడు.

డే–3 ఢిల్లీ 
మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు. ఇక్కడ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్‌ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభావంతులైన భారత చిన్నారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగమవుతాడు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ  పూర్తి చేసుకొని ఢిల్లీ వాసుల్ని అలరించనున్నాడు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్‌ షోలో పాల్గొంటాడు. సాకర్‌ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్‌లలో భాగమవుతాడు. 

ఎవరిని కలుస్తాడు: ప్రముఖ సెలబ్రిటీలను కలిసాక... మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఫుట్‌బాల్‌ ముచ్చటలో భాగమవుతాడు.

» దేశంలో సాకర్‌ దిగ్గజం గడిపేది 72 గంటలే! కానీ.... ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్‌ చేయడమే అతిపెద్ద విశేషం.  
»  కోల్‌కతా (తూర్పు), హైదరాబాద్‌ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) నగరాల్లో ఊపిరి సలపని బిజీ బిజీ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. 
»   నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాటామంతీ కలిపాక ఆఖర్లో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో ఈ పర్యటన ముగుస్తుంది. 
»  భారత టెస్టు, వన్డే కెప్టెన్శుబ్‌మన్‌ గిల్‌... దర్మశాలలో 14న మ్యాచ్‌ ముగిసిన వెంటనే తన ఫేవరెట్‌ ఫుట్‌బాలర్‌ను కలుసుకోనున్నాడు.  
»  ఈ పర్యటన పూర్తిగా భారత సాకర్‌ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్‌ ఫుట్‌బాల్‌ మ్యాచో, లేదంటే ఫ్రెండ్లీ మ్యాచో ఆడేందుకు మాత్రం కాదు.  
»  ఫ్యాన్స్‌కు ఇది కాస్త లోటే అయినా... బోలెండత వినోదాన్ని ఈ నాలుగు నగరాల్లో పంచనున్నాడు.  
» కోల్‌కతాలో 78 వేల సీటింగ్‌ సామర్థ్యమున్న సాల్ట్‌లేక్‌ స్టేడియం కిక్కిరిసిపోనుంది. 
»‘గోట్‌ టూర్‌’ మొదలవుతోందే బెంగాల్‌లో... శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్‌ ముమ్మాటికి సాకర్‌ క్రేజీ బెంగాలీలను ఊపేయనున్నాయి.  

60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి...
సింగరేణి ఆర్‌ఆర్‌9, అపర్ణ మెస్సీ ఆల్‌ స్టార్స్‌ ఈ రెండు జట్ల మధ్య 15 నిమిషాల పాటు సరదా మ్యాచ్‌ జరుగుతుంది. 39 వేల సీటింగ్‌ సామర్థ్యమున్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 27 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నేటి ఉదయం కల్లా హౌజ్‌ ఫుల్‌ అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. 

మెస్సీతో ఫొటో సెషన్‌ కోసం ఇప్పటికే 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్‌ చేయించుకున్నారని..., ఈ 60 మందితో మెస్సీ ఫొటోలు దిగుతారని హైదరాబాద్‌ గోట్‌ టూర్‌ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement