సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
సిరాజ్ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్తో పాటు చామా మిలింద్ (4-0-36-2), త్యాగరాజన్ (4-0-27-2), నితిన్ సాయి యాదవ్ (3-0-26-1), అర్ఫాజ్ అహ్మద్ (1-0-7-1) సత్తా చాటారు.
స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (29), హార్దిక్ తామోర్ (29), సూర్యాంశ్ షేడ్గే (28), సాయిరాజ్ పాటిల్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్ ఖాన్ (5), రఘువంశీ (4), అంకోలేకర్ (3), తనుశ్ కోటియన్ (2), తుషార్ దేశ్పాండే (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ డకౌటయ్యాడు.
అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు అమన్ రావ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్ 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సూపర్ లీగ్ పోటీల్లో భాగంగా జరిగింది.


