సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్‌సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.
అండర్ -14 టీమ్ అనే ప్రస్తావన లేదు
ఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్ అనే ప్రస్తావన లేదు.
అయినా సెలక్షన్‌కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్‌లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్‌తో పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.
BCCI గుర్తింపు కోసం
టీసీఏ జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.


