గ్యాస్‌ సబ్సిడీ.. అర్హత ఉన్నా కొందరికే రాయితీ! | Netizens Questions On Gas Subsidy In Telangana | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సబ్సిడీ.. అర్హత ఉన్నా కొందరికే రాయితీ!

Dec 12 2025 12:20 PM | Updated on Dec 12 2025 12:36 PM

Netizens Questions On Gas Subsidy In Telangana

కొంత మందికే వంటగ్యాస్‌ సిలిండర్‌  

మిగతా వారికి మూణ్నాళ్ల ముచ్చటగానే..  

సంబంధిత అధికారులకూ స్పష్టత కరువు  

ఇదీ ఆరు గ్యారంటీల లబ్ధిదారుల పరిస్థితి 

త్రిశంకు స్వర్గం చూపిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం  

సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్‌ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్‌’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్‌ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో  బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ రీఫిల్‌ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ  వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్‌ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్‌కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతోంది.  

మహాలక్ష్మి పథకం వర్తిస్తే.. 
ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా  మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్‌ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ  మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా  సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

స్పష్టత కరువు.. 
వంట గ్యాస్‌ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్‌ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు  సమాచారం.

ఆరు లక్షలు మించలే.. 
మహా హైదరాబాద్‌ పరిధిలో సుమారు 40 లక్షలపైగా  గృహోపయోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్‌దారుల్లో సుమారు 24 లక్షల  కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్‌ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్‌ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement