అంతర్జాతీయ టీ20ల్లో బహ్రెయిన్ ఫాస్ట్ బౌలర్ అలీ దావూద్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి రికార్డుల్లోకెక్కాడు. తాజాగా నేపాల్లో జరిగిన మ్యాచ్లో దావూద్ 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మలేసియా బౌలర్ స్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట ఉన్నాయి. ఓ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇద్రుస్ కేవలం 8 పరుగులే ఇచ్చి దావూద్ లాగే 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇద్రుస్, దావూద్ మాత్రమే ఇప్పటివరకు ఓ మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెహ్రెయిన్, భూటాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లోనే దావూద్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెహ్రెయిన్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన భూటాన్.. దావూద్ ధాటికి లక్ష్యానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో బెహ్రెయిన్ మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బెహ్రెయిన్ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది.


